గిరిజన నియోజకవర్గాలన్నింటిలో విజయం సాధించాలి: బండి సంజయ్‌

రాష్ట్రంలోని గిరిజన నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత నియోజకవర్గాల నాయకులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదేశించారు. నియోజకవర్గాల్లో

Published : 20 Jan 2022 05:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత నియోజకవర్గాల నాయకులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ఆయన చర్చించారు. గిరిజన నియోజకవర్గాల్లో భాజపా గెలుపు లక్ష్యంగా మిషన్‌-12 పేరిట బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయమని, రాష్ట్రంలో చేసే పోరాటానికి కేంద్ర నాయకత్వం అండగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పి, ఆ తరవాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుర్రంపోడు భూములపై భాజపా నాయకులు పోరాటం చేశారని, 35 రోజులు జైళ్లోనే ఉన్నారని సంజయ్‌ గుర్తు చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. గిరిజన నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ పర్యటించాలని సూచించారు. సమావేశంలో ఎంపీ సోయం బాపురావు, ఎస్టీ మెర్చా అధ్యక్షుడు హుస్సేన్‌ నాయక్‌, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్‌, రమేష్‌ రాథోడ్‌, చాడ సురేష్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు ఇంద్రసేనారెడ్డి, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని