తెరాసకు రూ.37.65 కోట్ల ఆదాయం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.37.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ పార్టీ భారత ఎన్నికల సంఘాని(ఈసీఐ)కి సమర్పించిన ఆడిట్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2020 మార్చి 31తో

Published : 21 Jan 2022 04:51 IST

రూ.319 కోట్ల విలువైన ఆస్తులు

ఈనాడు, దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.37.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ పార్టీ భారత ఎన్నికల సంఘాని(ఈసీఐ)కి సమర్పించిన ఆడిట్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ.136 కోట్లతో పోలిస్తే ఇది 71% తక్కువ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి ఫీజులు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా రూ.17.26 కోట్లు, స్వచ్ఛంద విరాళాలు, చందాల ద్వారా రూ.4.18 కోట్లు, ఇతర ఆదాయం రూ.16.21 కోట్లు వచ్చింది. ఇదే సమయంలో రూ.22.34 కోట్లు ఖర్చయినట్లు పార్టీ ఈ నివేదికలో తెలిపింది. అంతిమంగా రూ.15.30 కోట్ల మిగులు నిధి ఉందని, దాన్ని సాధారణ నిధి (జనరల్‌ ఫండ్‌)కి జమచేశామని పేర్కొంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి పార్టీ జనరల్‌ ఫండ్‌ రూ.307 కోట్లకు చేరింది. ఇందులో క్రితం సంవత్సరం కంటే రూ.15 కోట్ల వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో అప్పులు రూ.3 కోట్ల మేర పెరిగాయి. మొత్తం భౌతిక ఆస్తుల విలువ 2021 మార్చి 31 నాటికి రూ.31.06 కోట్లకు చేరింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.256 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. క్రితం ఏడాదితో పోలిస్తే ఇందులో కేవలం రూ.25 లక్షల పెరుగుదల మాత్రమే కనిపించింది. ఈ డిపాజిట్లతో పాటు, ఇతర బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు కలిపితే మొత్తం తాజా ఆస్తుల విలువ (కరెంట్‌ అసెట్స్‌) రూ.288.24 కోట్ల మేర ఉన్నట్లు ఆడిట్‌ నివేదికలో పేర్కొంది. ఇది క్రితం సంవత్సరం కంటే రూ.9 కోట్లు పెరిగినట్లు ఆడిట్‌ నివేదికలో పేర్కొంది. మొత్తంగా పార్టీ స్థిర, చరాస్తులు రూ.319 కోట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని