ఎస్పీని వీడిన ములాయం తోడల్లుడు

ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్థి నేతలకు కండువాలు కప్పడంలో అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష సమాజ్‌వాదీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులను,

Published : 21 Jan 2022 04:54 IST

 


భాజపా యూపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ (మధ్యలో వ్యక్తి)తో ప్రమోద్‌ గుప్తా,  ప్రియాంకా మౌర్య

లఖ్‌నవూ: ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్థి నేతలకు కండువాలు కప్పడంలో అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష సమాజ్‌వాదీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులను, పలువురు శాసనసభ్యులను చేర్చుకుని సమాజ్‌వాదీ పార్టీ.. భాజపాకు ఝలక్‌ ఇచ్చింది. ఇప్పుడు కమలం పార్టీ.. ఎదురుదాడి ప్రారంభించింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణా యాదవ్‌ బుధవారం కాషాయ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. గురువారం ములాయం తోడల్లుడు ప్రమోద్‌ గుప్తా కూడా సైకిల్‌ దిగి కమలం గూటికి చేరారు. గతంలో ఎస్పీ శాసనసభ్యుడిగా పనిచేసిన ప్రమోద్‌.. ములాయం రెండో భార్య సాధనా గుప్తా సోదరి భర్త. ప్రమోద్‌ పార్టీని వీడుతూ..అఖిలేశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి ములాయంను అఖిలేశ్‌ ఓ ఖైదీలా బంధించి ఉంచారని, నేతాజీని బహిరంగంగా మాట్లాడనీయడం లేదని ఆరోపించారు. మరోవైపు యూపీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ‘‘నేను అమ్మాయిని.. పోరాడగలను’’ అంటూ చేసిన ప్రచార కార్యక్రమంలోని గోడపత్రికల్లో ప్రముఖంగా కనిపించిన ప్రియాంకా మౌర్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

కర్హల్‌ నుంచి బరిలోకి అఖిలేశ్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా పోటీ చేయనున్నారు. ఆయన మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేశ్‌.. విధానసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

పాత పింఛను పథకంపై ఎస్పీ హామీ

సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని అఖిలేశ్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. ‘‘ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించాను. ఆర్థిక నిపుణులతోనూ మాట్లాడాను. కార్పస్‌ ఫండ్‌ను ఏర్పరిచి ఇందుకు సంబంధించిన నిధులను ఏర్పాటు చేస్తా’’ అని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని