ప్రియాంకే సీఎం అభ్యర్థి!

ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది! పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆ పదవి రేసులో ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. దీనిపై

Updated : 22 Jan 2022 06:04 IST

స్వయంగా సంకేతాలిచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి

దిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది! పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆ పదవి రేసులో ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. దీనిపై ఆమే స్వయంగా సంకేతాలిచ్చారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రియాంక విలేకర్లతో మాట్లాడారు. యూపీలో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నేను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా? మరి ఇంకేంటి? రాష్ట్రంలో ఎక్కడచూసినా నేనే కనిపిస్తున్నానుగా’’ అని పేర్కొన్నారు. దీంతో- సీఎం అభ్యర్థిగా ఆమె పేరు ఖరారైనట్లేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రియాంక చెప్పారు.

యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో

యూపీ యువత కోసం ‘భర్తీ విధాన్‌’ పేరుతో కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక ఆ ప్రణాళికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వరంగంలోని ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయనున్నట్లు హస్తం పార్టీ అందులో ప్రకటించింది. మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. వాటిలో 8 లక్షల కొలువులను మహిళలకు కేటాయిస్తామని పేర్కొంది. కాంగ్రెస్‌తోనే మంచి భవిష్యత్తు సాధ్యమని రాహుల్‌ అన్నారు.


కాంగ్రెస్‌లోకి భాజపా బహిష్కృత నేత హరక్‌సింగ్‌

దిల్లీ: ఉత్తరాఖండ్‌ భాజపా బహిష్కృత నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరక్‌సింగ్‌ రావత్‌ హస్తం పార్టీలో చేరారు. ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ సమక్షంలో హరక్‌సింగ్‌తో పాటు ఆయన కోడలు అనుకృతి గుసైన్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. అనుకృతికి లాన్స్‌డౌన్‌ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవలే హరక్‌సింగ్‌పై భాజపా వేటు వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని