బండి సంజయ్‌ కేసులో వివరణ ఇవ్వండి

పార్లమెంటు సభ్యుడిగా నిర్వర్తిస్తున్న విధులకు అడ్డు తగిలి, తనపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చేసిన వినతిపై లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ

Published : 22 Jan 2022 04:57 IST

ఫిబ్రవరి 3న రావాలని సీఎస్‌, డీజీపీలకు లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశం

అంతకు ముందు హాజరై వివరాలు అందజేసిన ఎంపీ

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా నిర్వర్తిస్తున్న విధులకు అడ్డు తగిలి, తనపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చేసిన వినతిపై లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ స్పందించింది. శుక్రవారం ఆయన నుంచి వివరాలు తీసుకున్న కమిటీ ఫిబ్రవరి 3న తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు బండి సంజయ్‌ పార్లమెంటు ప్రాంగణంలో సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించి అందుకు సంబంధించిన ఆధారాలను ఫొటోలు, వీడియోలతో సహా సమర్పించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఎంపీ ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా చేసిన దాడిని హైకోర్టు తప్పుబట్టి, తనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా మరణించిన ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళ్లడానికి ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకొని తనపై క్రూరంగా దాడికి పాల్పడినట్లు వివరించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల జీవితాలను తలకిందులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 2న కరీంనగర్‌లోని తన కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలనూ అనుసరిస్తూ తలపెట్టిన జాగరణ కార్యక్రమంపైనా పోలీసులు దాడి చేయడంతో పాటు అక్రమంగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఆ దృశ్యాలు బయటకు రాకుండా ఉండటానికి పోలీసులు సీసీ కెమెరాలను, హార్డ్‌ డిస్క్‌లను తొలగించి తీసుకుపోయారంటూ అందుకు సంబంధించిన ఫొటోలను కమిటీకి అందజేశారు. తనపై పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట, హుజూరాబాద్‌, కరీంనగర్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు రామచందర్‌రావు, వి.శ్రీనివాస్‌, నరేష్‌, కరీంనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ కె.శ్రీనివాస్‌తో పాటు గుర్తు తెలియని పోలీసు సిబ్బంది దాడి చేసినట్లు సంజయ్‌ కమిటీకి తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజాసమస్యలపై పోరాడుతున్న తన హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలో ఇతర పోలీసు అధికారులనూ కమిటీ పిలిపించి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని