మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం

కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం

Updated : 23 Jan 2022 05:25 IST

 భాజపాతో దేశానికి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం

సీపీఎం మహాసభలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆన్‌లైన్‌ మహాసభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యం. పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పార్టీశాఖలు నిర్ణయం తీసుకుంటాయి. కలిసి పోరాడితే ప్రజల్ని ఓడించగలిగేవారు లేరనేది ఇటీవల రైతు ఉద్యమం చాటిచెప్పింది. ప్రధాని మోదీ దిగిరాక తప్పలేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, మత సామరస్యంపైన జరుగుతున్న దాడులను, దోపిడీని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలే సరైన మార్గం. దీనికోసం ఎలాంటి ఎత్తుగడ అనుసరించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దేశంలో అందరికీ రెండు డోసులు వ్యాక్సిన్‌ వేస్తే ప్రజలు కరోనా నుంచి బయటపడే అవకాశం ఉన్నా కేంద్రం చేతులు ఎత్తేసింది. దేశ సంపదంతా లూటీ అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశంలో కోటీశ్వరుల వద్ద ఉన్న సంపద విలువ 55.5 శాతం దేశ ప్రజల సంపదతో సమానం. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం దేశంలో ఆకలి, పేదరికం సూచీలు పడిపోతున్నాయి. ఎనిమిదేళ్లలో సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు, హత్యలు చోటుచేసుకున్నా సరైన నివారణ చర్యలు లేవు. వ్యవసాయం, విద్య, సహకార, విద్యుత్‌ తదితర వ్యవస్థలపై రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. పార్లమెంటును రబ్బరు స్టాంపుగా మార్చారు. సీబీఐ, ఈడీలను స్వార్థానికి వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు’’ అంటూ సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ మాట్లాడుతూ.. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమనేది అంతా గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీతారాములు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

పలు అంశాలపై చర్చ, తీర్మానాలు

భారత కమ్యునిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం వరకు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో నిర్వహించనున్న ఈ సభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారాట్‌, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు కేంద్ర కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.


ప్రజా తెలంగాణయే సీపీఎం లక్ష్యం

తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాలకులు బంగారు తెలంగాణ నిర్మిస్తామని వాగ్దానం చేసినా నెరవేర్చలేదు. ప్రజా తెలంగాణ సాధించడం ఎలా అనేదానిపై పార్టీ ఆలోచన చేస్తోంది. కేంద్రంపై యుద్ధం ప్రకటించకపోతే ప్రజల ప్రయోజనాలకు రక్షణ కష్టం. కాంగ్రెస్‌ సరైన తీరులో స్పందించడం లేదు.

- బీవీ రాఘవులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు


రాష్ట్రంలో విషసర్పంలా భాజపా 

రాష్ట్రంలో భాజపా విషసర్పంలా ఎదుగుతోంది. దేశంతో పాటు ఈ రాష్ట్రంలోనూ సీపీఎంకు భాజపాయే ప్రధాన రాజకీయ శత్రువు. మరోమారు ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తాం. భాజపా దాడి కేవలం కమ్యునిస్టులపైనే కాదు తెరాసపైనా ఉంది. అయినా సీఎం కేసీఆర్‌ పోరాటం చేయడం లేదు. భాజపాతో బేరసారాలు ఆడుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు. ఆయనతో ఎన్నికల పొత్తు పెట్టుకోం.

- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు