దళితుల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో దళితుల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్లు కేటాయించేలా భాజపా ఎంపీలు ఒత్తిడి తేవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కపట....

Published : 23 Jan 2022 05:09 IST

భాజపా ఎంపీలూ.. కేంద్రంపై ఒత్తిడి తెండి

మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట, న్యూస్‌టుడే, బెజ్జంకి: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో దళితుల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్లు కేటాయించేలా భాజపా ఎంపీలు ఒత్తిడి తేవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కపట దీక్షలు మాని రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కేంద్రంతో కొట్లాడాలన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. జీవో 317పై భాజపా నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆ ఉత్తర్వును తప్పుపట్టడం అంటే కేంద్రాన్ని, రాష్ట్రపతి ఉత్తర్వులను కించపరిచినట్లేనని అన్నారు. ఏపీలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తుంటే.. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను పరిమితిని కేంద్రం రూ.6 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకే ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే చేపట్టిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా రెండో దశలో చేపట్టిన జ్వర సర్వేను కేంద్రం సహా నీతి ఆయోగ్‌ ప్రశంసించిందన్నారు. సిద్దిపేట 37వ వార్డులో అర గంటకు పైగా పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. పలువురికి స్వయంగా కొవిడ్‌ మందుల కిట్లు అందించి, అవి ఎలా వాడాలో వివరించారు. ‘‘నిత్యం లక్షకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. 2 కోట్ల పరీక్షల కిట్లు, కోటి మందుల కిట్లు అందుబాటులో ఉన్నాయి. 27 వేల ఆక్సిజన్‌ పడకలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. సీఎం సూచనల మేరకు వైద్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించాం’’ అని మంత్రి వివరించారు.

కరోనా నిబంధనల మధ్య గణతంత్ర వేడుకలు: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించే గణతంత్ర దిన వేడుకల సందర్భంగా విధిగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఉదయం 10 గంటలకు కలెక్టర్లు, అన్ని శాఖల అధిపతులు తమ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. వేడుకల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని