ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ (రంజిత్‌ ప్రతాప్‌ నారాయణ్‌ సింగ్‌) మంగళవారం పార్టీకి రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌

Updated : 26 Jan 2022 06:24 IST

భాజపా గూటికి కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌సింగ్‌
రాహుల్‌ సన్నిహితునిగా గుర్తింపు పొందిన నేత
స్వామిప్రసాద్‌ మౌర్యపై పోటీకి దింపనున్న కాషాయదళం

ఈనాడు-దిల్లీ, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ (రంజిత్‌ ప్రతాప్‌ నారాయణ్‌ సింగ్‌) మంగళవారం పార్టీకి రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ప్రచార తారల జాబితాలో సింగ్‌ పేరు కూడా ఉంది. మరుసటి రోజే ఆయన పార్టీని వీడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి, భాజపా యూపీ వ్యవహారాల బాధ్యుడు ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో దిల్లీలో ఆయన కమల దళంలో చేరారు. ఇటీవల మంత్రివర్గం నుంచి వైదొలగి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఓబీసీ నేత స్వామిప్రసాద్‌ మౌర్యపై పడ్‌రౌనా నియోజకవర్గం నుంచి ఆయన్ను కాషాయ పార్టీ పోటీకి నిలబెట్టనున్నట్లు సమాచారం. 57 ఏళ్ల సింగ్‌ ఈ నియోజకవర్గం నుంచి 1996, 2002, 2007లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. ఆయన ఖుషీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో గెలుపొంది యూపీయే-2 సర్కారులో కేంద్ర రహదారి రవాణా, పెట్రోలియం, హోం శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో భాజపా చేతిలో 85వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇందిర హయాం నుంచి పార్టీతో అనుబంధం

సింగ్‌కు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఇదివరకు యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగానూ ఉన్నారు. ఆయన తండ్రి సీపీఎన్‌ సింగ్‌ 1980లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రక్షణశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తండ్రి హత్యకు గురైన తర్వాత ఆర్‌పీఎన్‌ సింగ్‌ రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన సతీమణి సోనియాసింగ్‌ ఎన్‌డీటీవీలో న్యూస్‌ యాంకర్‌. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఇప్పుడు తానొక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొంటూ సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. మైనార్టీ నాయకుడు హైదర్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పొందిన తర్వాత ఆ పార్టీని వీడి అప్నాదళ్‌లో చేరిన 24 గంటల్లోపే కాంగ్రెస్‌కు సింగ్‌ రూపంలో శరాఘాతం తగిలింది. స్వామిప్రసాద్‌ మౌర్య, సింగ్‌ల మధ్య 2009 నుంచి రాజకీయ యుద్ధం నడుస్తోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఖుషీనగర్‌, పడ్‌రౌనా రాజకీయాలపై సింగ్‌ పట్టు క్రమంగా సడలడం మొదలైంది. ఇప్పుడు కోల్పోయిన ప్రాభవాన్ని భాజపాలో చేరడం ద్వారా తిరిగి సంపాదించుకోవాలని సింగ్‌ యోచిస్తున్నారు.

సైద్ధాంతిక పోరులో పిరికివారికి చోటులేదు: కాంగ్రెస్‌

సింగ్‌ పరిణామంపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. సైద్ధాంతిక పోరులో పిరికివారికి చోటు లేదని వ్యాఖ్యానించింది. కేవలం ధైర్యవంతులే ఈ పోరాటంలో తమతో రాగలరని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని