Published : 26 Jan 2022 05:10 IST

యూపీ ప్రజల ఆకాంక్ష వేరు

విభజన రాజకీయాలు భాజపా, ఎస్పీలకు నప్పుతాయి
యోగి ఆదిత్యనాథ్‌ ప్రాభవాన్ని తగ్గించేందుకు కమలం యత్నం
పీటీఐ ఇంటర్వ్యూలో ప్రియాంకా గాంధీ

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు మతపరమైన విభజనను కోరుకోవడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. అలాంటి విభజన.. భాజపా, ఎస్పీలకు మాత్రమే నప్పుతుందని చెప్పారు. మతపరమైన విభజన వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది భాజపాయే కావచ్చని ఆమె చెప్పారు. మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భాజపా ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నా, ఆ పార్టీకి పాలించడమే రాదని యూపీని చూస్తే తెలుస్తుందన్నారు. ముఖాముఖి ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

కులమతాలపై కాదు.. అభివృద్ధిపైనే ఎన్నికలు

‘‘యూపీలో వేర్వేరు రాజకీయ పార్టీలు భిన్న అంశాలను లేవనెత్తుతున్నాయి. కులం, మతం ప్రాతిపదికన ప్రజల్ని విడదీసేవి వీటిలో కొన్ని ఉన్నాయి. ఈ పద్ధతిలోనే యూపీలో ఎన్నికల్లో పోరాడి గెలుస్తున్నారనేది వాస్తవం. ఈ పరిస్థితి మారాలని నేను గట్టిగా భావిస్తున్నా. అభివృద్ధి, ఉపాధి కల్పన, ఆరోగ్య సేవలు, విద్య లాంటి అంశాలపై ఎన్నికల్లో పోరాడాలి. చర్చలన్నీ వాటిచుట్టూ సాగాలి. వ్యతిరేక ప్రచారం జోలికి పోకుండా పురోగమన, సానుకూల అంశాలే కేంద్రంగా యూపీలో కాంగ్రెస్‌ పనిచేస్తోంది.  

బలాన్ని గుర్తెరిగితే రాజకీయాలను మార్చగలరు

జనాభాలో 50% మంది మహిళలే ఉన్నా రాజకీయ యవనికపై వారికి ఇప్పటివరకు తగిన ప్రాతినిథ్యం లేదు. తమ బలాన్ని గుర్తెరిగి, రాజకీయ/ ఎన్నికల శక్తిగా వారంతా మారితే దేశ రాజకీయాలనే వారు మార్చగలరు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి మేం టికెట్‌ ఇచ్చాం. రాజకీయ బలం ఉన్న ఎమ్మెల్యే చేతిలో ఆ కుటుంబం నాశనమైంది. అదే అధికారాన్ని ఉపయోగించుకుని, కొత్త జీవితాన్ని ఏర్పరచుకుని, ఇతరులకు సాయపడే అవకాశాన్ని ఆ కుటుంబానికి ఇవ్వడమే మా ఉద్దేశం.

ఆదిత్యనాథ్‌ విషయం బహిరంగ రహస్యమే

ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రాభవాన్ని తగ్గించాలని ఆయన పార్టీ ఎప్పటినుంచో చూస్తోంది. అందుకే ఆయన్ని గోరఖ్‌పుర్‌ నుంచి పోటీ చేయిస్తున్నారు. అది బహిరంగ రహస్యమే. పార్టీ అంతర్గత కలహాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

కాంగ్రెస్‌ యూపీ సీఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు సరదాగా నేను బదులిస్తూ ‘మరెవరైనా ఉన్నారా’ అని అన్నాను. అంతే. సీఎం అభ్యర్థిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ప్రియాంక చెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని