భాజపాకు ఓ విధానం ఉందా?

ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పడం తప్పా? పాఠశాలలు బాగు చేయడం తప్పా? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే 317 జీవోపై కోర్టులో కేసులు ఎందుకు వేస్తారు? అని మంత్రి హరీశ్‌రావు భాజపాను ప్రశ్నించారు.

Published : 26 Jan 2022 05:14 IST

ఆ పార్టీవి మాటలు ఎక్కువ..పనులు తక్కువ
మంత్రి హరీశ్‌రావు మండిపాటు

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పడం తప్పా? పాఠశాలలు బాగు చేయడం తప్పా? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే 317 జీవోపై కోర్టులో కేసులు ఎందుకు వేస్తారు? అని మంత్రి హరీశ్‌రావు భాజపాను ప్రశ్నించారు. అసలు ఆ పార్టీకి ఓ విధానం అంటూ ఉందా? అని మండిపడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకలు, నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌లో 50పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాలను హరీశ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలకు తలొగ్గి కొన్ని పార్టీలు ఆంగ్ల మాధ్యమం చదువులు, పాఠశాలల బాగును వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. వచ్చే సంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని చేపడతామంటే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. భాజపావి మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే సంవత్సరం మరో నాలుగు వైద్య కళాశాలలను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయని హరీశ్‌రావు తెలిపారు. మరో అయిదు నెలల్లో 10 మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. నవజాత శిశువుల మరణాలను తగ్గించడానికి రాష్ట్రంలో ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాలను 18 నుంచి 65కు పెంచినట్లు వివరించారు. ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. దగ్గు, జలుబు, ఆయాసం, నొప్పులు ఏం ఉన్నా ఇంటికివచ్చే సిబ్బందికి చెప్పాలన్నారు.  

హరీశ్‌రావు కాన్వాయిని అడ్డుకున్న భాజపా

వనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకుని నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌కు వెళ్తుండగా పెంట్లవల్లి వద్ద హరీశ్‌రావు కాన్వాయిని భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఉద్యోగాల ప్రకటన ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డుకు అడ్డుగా వచ్చారు. పోలీసులు వారినిచెదరగొట్టి మంత్రి వాహనశ్రేణిని పంపించేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని