కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన అవార్డు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు ఆ పార్టీలో అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఆజాద్‌ను అభినందించే విషయంలో కాంగ్రెస్‌ నేతల మధ్య స్పష్టమైన చీలిక

Updated : 27 Jan 2022 05:28 IST

పద్మ భూషణ్‌కు ఎంపికైన గులామ్‌ నబీ ఆజాద్‌కు కపిల్‌ సిబల్‌, ఆనంద్‌శర్మ అభినందనలు
వ్యంగ్యాస్త్రం సంధించిన జైరామ్‌ రమేశ్‌
కొత్త పార్టీ పుకారు దుష్ప్రచారమేనని తోసిపుచ్చిన ఆజాద్‌

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు ఆ పార్టీలో అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఆజాద్‌ను అభినందించే విషయంలో కాంగ్రెస్‌ నేతల మధ్య స్పష్టమైన చీలిక కనిపించింది. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించాలంటూ ఏడాదిన్నర క్రితం సోనియా గాంధీకి లేఖ రాసిన వారి(గ్రూప్‌-23)లో ఆజాద్‌ కూడా ఒకరు. కేంద్ర ప్రభుత్వం గులామ్‌ నబీ ఆజాద్‌కు మంగళవారం పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన తర్వాత జీ-23 సభ్యులైన కపిల్‌సిబల్‌, ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌ తదితరులు అభినందనలు తెలిపారు. ‘ప్రజలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అందించిన సమున్నత సేవలకు జీవితకాల గుర్తింపు పొందిన గులామ్‌ నబీకి హృదయపూర్వక అభినందలు’ అంటూ ఆనంద్‌ శర్మ ట్వీట్‌ చేశారు. ‘సోదరా నీకు అభినందనలు. ప్రజాసేవలకు దేశం నిన్ను గుర్తించింది. కానీ, నీ సేవలు కాంగ్రెస్‌కు అవసరంలేకపోవడం బాధాకరం’ అని సిబల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తీరును తప్పుబట్టారు. రాజ్‌బబ్బర్‌ కూడా వారితో శ్రుతి కలిపారు. అయితే, ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు. సీపీఎం నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య కేంద్రం తనకు ప్రకటించిన పద్మ భూషణ్‌ అవార్డును తిరస్కరించగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఆ సందర్భాన్ని ఆజాద్‌కు చురకలు వేసేందుకు వినియోగించుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ పద్మభూషణ్‌ అవార్డును తిరస్కరించి మంచి పని చేశారు. ఆయన స్వతంత్రం(ఆజాద్‌)గా ఉండాలనుకున్నారు. బానిస(గులామ్‌)గా కాదు’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

అదేసమయంలో, ఆజాద్‌ ట్విటర్‌ బయోను మార్చినట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆజాద్‌ స్వయంగా వివరణ ఇచ్చారు. తాను ట్విటర్‌ ప్రొఫైల్‌ను మార్చలేదని స్పష్టం చేశారు. ఇది గందరగోళం సృష్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారమని అన్నారు. పార్టీలో సంస్కరణలు కోరుతూ లేఖ రాసిన వ్యవహారం తర్వాత సోనియా గాంధీ విధేయుల నుంచి ఆజాద్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని మోదీ.. రాజ్యసభలో ఆజాద్‌ను మెచ్చుకుంటూ కన్నీటిపర్యంతం అవడం, ఆ తర్వాత మోదీపై ఆజాద్‌ ప్రశంసలు కురిపించడం వంటి ఘటనలు.. కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయ భవితవ్యంపై ఆజాద్‌ మాట్లాడుతూ తానిప్పుడు స్వేచ్ఛా జీవినని.. ఎక్కడికైనా వెళ్తానని చెప్పడమూ కాంగ్రెస్‌లో కలకలం రేపింది.


జైరామ్‌ రమేశ్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన శివసేన

కేంద్ర ప్రభుత్వ పురస్కారం విషయంలో గులామ్‌ నబీ ఆజాద్‌ను ఆక్షేపించేలా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ చేసిన వ్యాఖ్యలను శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియంకా చతుర్వేది, టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుష్మితాదేవ్‌ తప్పుపట్టారు. విపక్ష నేతలకు అవార్డులను ప్రకటించడం ఇదే ప్రథమం కాదని గుర్తు చేశారు. పౌర పురస్కారాల స్ఫూర్తిని గౌరవించాలని సూచించారు. గతంలో అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌కు పద్మభూషణ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి భారత రత్న ప్రకటించారని.. వారికీ ‘బానిసత్వం’ ఆపాదిస్తారా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని