Updated : 28 Jan 2022 05:18 IST

మాయావతి పంచతంత్రం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(భాజపా), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లను ఎదుర్కొవడానికి బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి పంచతంత్రాన్ని రూపొందించారు. ఐదు అంశాలపై ఆమె తన ప్రత్యర్థులను ఎన్నికల క్షేత్రంలో ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రూపొందించారు. ఈ ఎన్నికల రణతంత్రం.. మళ్లీ యూపీలో బీఎస్పీని అధికార పీఠం ఎక్కిస్తుందని ఆమె నమ్ముతున్నారు. ఆ అంశాలేంటంటే..

1.దళితుల హక్కులు
భాజపా-ఎస్పీలను దళిత వ్యతిరేకులని మాయావతి ప్రచారం చేయనున్నారు. దీని వల్ల చెల్లా చెదురైన తన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలన్నది ఆమె ప్రణాళిక. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై అధికార భాజపాను ఆమె నిలదీయనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ మార్గాల ద్వారా రిజర్వేషన్ల ప్రభావాన్ని తగ్గించేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించనున్నారు. కులగణనను భాజపా వ్యతిరేకించటాన్ని కూడా ఆమె ప్రస్తావించనున్నారు. పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లును చింపివేసిన సమాజ్‌వాదీ పార్టీ విషయంలోనూ దళితులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించనున్నారు.

2. శాంతిభద్రతలు
యూపీలో శాంతి భద్రతల అంశాన్ని మాయావతి ప్రధానంగా లేవనెత్తనున్నారు. ఇందులో లఖింపుర్‌ హింస, పోలీస్‌ కస్టడీలో మరణాలు, ఎన్‌కౌంటర్లు, మహిళలపై హింసాత్మక ఘటనలపై ఆమె యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అదే సమయంలో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హింసనూ ప్రస్తావించనున్నారు

3.నిరుద్యోగం-రైతులు
మాయావతి తన ఎజెండాలో నిరుద్యోగం, కార్మికుల సమస్యలనూ చేర్చారు. ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారం,ఉద్యోగాల భర్తీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీపైనా భాజపా సర్కార్‌ను ఇరుకున పెట్టనున్నారు. అదే సమయంలో ఎస్పీ హయాంలో జరిగిన అవినీతిపైనా దాడి చేయనున్నారు.

4. విధానాలను చూడండి
బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో తాను అనుసరించిన విధానాలను మాయావతి ప్రజల ముందు పెట్టనున్నారు. గతంలో తమ ప్రభుత్వం.. శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలకు వివరించనున్నారు. దీంతో పాటు.. దళితులు, మహిళలు, కార్మికులు, పేద, యువత, ఉద్యోగులకు తమ హయాంలో చేసిన మేలునూ చెప్పనున్నారు. ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ద్వారా వారిని తనవైపు తిప్పుకోవాలని మాయావతి భావిస్తున్నారు.

5. బ్రాహ్మణులు-ముస్లింలు
ఎన్నికల సభల్లో వివిధ వర్గాల మధ్య సోదర భావం పెంపొందేలా మాయావతి ప్రసంగాలు చేయనున్నారు. దళితులతో పాటు ముస్లింలు, అగ్రవర్ణాలకు కూడా తాము ప్రాధాన్యతిస్తామన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయనున్నారు. ముఖ్యంగా అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులపై బీఎస్పీ అధినేత్రి దృష్టి పెట్టనున్నారు. ఈ విధానంతోనే ఆమె 2007లో అధికారం సాధించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని