సీఎంవో ప్రమేయంతోనే అర్వింద్‌పై దాడి

భాజపా నాయకులపై దాడి ఘటనలు సీఎంవో డైరెక్షన్‌.. పోలీసు కమిషనర్‌ పర్యవేక్షణలోనే జరిగాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రెండు రోజుల కిందట నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ అర్వింద్‌

Published : 28 Jan 2022 04:13 IST

ఘటనపై సీఎం స్పందించాలి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, నిజామాబాద్‌: భాజపా నాయకులపై దాడి ఘటనలు సీఎంవో డైరెక్షన్‌.. పోలీసు కమిషనర్‌ పర్యవేక్షణలోనే జరిగాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రెండు రోజుల కిందట నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగిన ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. గాయపడిన నలుగురు కార్యకర్తలను పరామర్శించారు. సాయంత్రం నందిపేట్‌లో విలేకరులతో మాట్లాడారు. దాడికి కుట్ర జరుగుతోందంటూ తమ ఎంపీ ముందుగానే పోలీసులకు సమాచారమిచ్చారని ఆయన చెప్పారు. భాజపా ఎదుగుదలను చూసి కేసీఆర్‌ డిప్రెషన్‌తో భౌతికదాడులు చేయిస్తున్నారని విమర్శించారు. తెరాస ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలని, తమను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. అర్వింద్‌పై రైతులు దాడులు చేశారని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతులు ఎప్పుడూ కర్రలు, కత్తులు పట్టుకొని దాడులు చేయరన్నారు. మానవత్వం ఉంటే దాడిపై సీఎం స్పందించాలన్నారు. సీపీని సస్పెండ్‌ చేయాలని, దాడితో సంబంధం ఉన్నవారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని చెప్పారు. ఈ పర్యటనలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, తమిళనాడు రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. బండి సంజయ్‌ నిజామాబాద్‌కు బయలుదేరేముందు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌పై దాడితో తమకు సంబంధం లేదంటూ ఆ జిల్లా రైతు సంఘం ప్రకటించిందని సంజయ్‌ స్పష్టం చేశారు.

ఎంపీ అర్వింద్‌కు గవర్నర్‌ ఫోన్‌
ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు గవర్నర్‌ తమిళిసై గురువారం ఫోన్‌ చేశారు. దాడి ఘటన వివరాలు ఆరా తీశారు. తనపై దాడికి పోలీసులు సహకరించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు అర్వింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చించి తగు చర్యలు సూచిస్తామని గవర్నర్‌ తనకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని