పంజాబ్‌లో భాజపా రెండో జాబితా విడుదల

పంజాబ్‌లో వచ్చే నెల జరగనున్న శాసనసభ ఎన్నికలకు గాను భాజపా 27 మంది అభ్యర్థుల పేర్లతో తన రెండో జాబితాను గురువారం ప్రకటించింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేతలు ఇద్దరికి అవకాశం కల్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి మంత్రివర్గంలో పనిచేసిన విజయ్‌ సాంప్లాను కూడా బరిలోకి దించింది.

Published : 28 Jan 2022 05:02 IST

27 పేర్ల వెల్లడి
బరిలో కేంద్ర మాజీ మంత్రి
కమలం గూటికి చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు

చండీగఢ్‌: పంజాబ్‌లో వచ్చే నెల జరగనున్న శాసనసభ ఎన్నికలకు గాను భాజపా 27 మంది అభ్యర్థుల పేర్లతో తన రెండో జాబితాను గురువారం ప్రకటించింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేతలు ఇద్దరికి అవకాశం కల్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి మంత్రివర్గంలో పనిచేసిన విజయ్‌ సాంప్లాను కూడా బరిలోకి దించింది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌, సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా సారథ్యంలోని శిరోమణి అకాళీదళ్‌(సంయుక్త్‌)లతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తోంది. భాగస్వామ్య పక్షాలతో కుదిరిన అవగాహన మేరకు 65 స్థానాల్లో కమలం అభ్యర్థులు పోటీ పడనున్నారు.

* కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇటీవలే భాజపాలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఫతేజంగ్‌ సింగ్‌ బాజ్వా, హర్‌జోత్‌ కమల్‌లకు తాజా జాబితాలో భాజపా టికెట్లు కేటాయించింది. తన ప్రస్తుత నియోజకవర్గమైన మోగా నుంచే హర్‌జోత్‌ కమల్‌ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానం నుంచి నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ను బరిలోకి దించింది.
షెడ్యూల్డ్‌ కులాల నేషనల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా..ఫగ్వారా నుంచి కమలం అభ్యర్థిగా పోటీ చేస్తారు. శిరోమణి అకాళీదళ్‌ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ పోటీ చేస్తున్న లాంబి నియోజకవర్గం నుంచి భాజపా తరఫున రాకశ్‌ ధింగ్రా పోటీ చేయనున్నారు.
* ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్‌ పోటీ చేస్తున్న ధూరి నియోజకవర్గం నుంచి రణదీప్‌సింగ్‌ దేవోల్‌ కమలం అభ్యర్థిగా బరిలో ఉంటారు. మైనార్టీల నేషనల్‌ కమిషను ఛైర్మన్‌గా ఉన్న ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురను రూప్‌నగర్‌ నుంచి భాజపా పోటీ చేయిస్తోంది.
* శిరోమణి అకాలీదళ్‌ జలంధర్‌ కంటోన్మెంట్‌ టికెటు ఇచ్చేందుకు నిరాకరించిన మాజీ ఎమ్మెల్యే సరబ్‌జిత్‌ సింగ్‌ మక్కర్‌ భాజపాలో చేరగా.. అదే స్థానం టికెటును కమలం ఆయనకు కేటాయించింది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు