తెరాసను అజేయశక్తిగా నిలుపుదాం

ప్రజాభిమానం, ఆశీర్వాదాలతో తెరాసను అజేయశక్తిగా నిలిపేందుకు జిల్లాల కొత్త అధ్యక్షులు కృషి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. కొత్తగా నియమితులైన పార్టీ జిల్లా అధ్యక్షులు శుక్రవారం కేటీఆర్‌ను

Published : 29 Jan 2022 04:16 IST

కొత్త జిల్లా అధ్యక్షులకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాభిమానం, ఆశీర్వాదాలతో తెరాసను అజేయశక్తిగా నిలిపేందుకు జిల్లాల కొత్త అధ్యక్షులు కృషి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. కొత్తగా నియమితులైన పార్టీ జిల్లా అధ్యక్షులు శుక్రవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో వేర్వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సమతూకంతో కొత్త అధ్యక్షులను నియమించారన్నారు. వారు తమ తమ జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సమర్థతను నిరూపించుకోవాలని సూచించారు. త్వరలోనే పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభమవుతాయని, నిరంతరం పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. తెరాస శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. వచ్చే ఏడాది డిసెంబరులో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి జిల్లా అధ్యక్షులు కృషి చేయాలన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి (నిజామాబాద్‌), బాల్క సుమన్‌ (మంచిర్యాల), శంభీపూర్‌ రాజు (మేడ్చల్‌). ఆరూరి రమేశ్‌ (వరంగల్‌), రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), రవీంద్రకుమార్‌ (నల్గొండ), కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (జగిత్యాల), ఎం.కె.ముజీబుద్దీన్‌ (కామారెడ్డి), జీవీ రామకృష్ణారావు (కరీంనగర్‌), తోట ఆగయ్య (రాజన్న సిరిసిల్ల) బడుగుల లింగయ్య (సూర్యాపేట), కంచర్ల రామకృష్ణారెడ్డి (యాదాద్రి భువనగిరి) తదితరులున్నారు. వారి వెంట మంత్రులు గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని