Updated : 29 Jan 2022 05:53 IST

దళితుల కటాక్షం దక్కేదెవరికి?

పంజాబ్‌ రాజకీయాల్లో వారే కీలకం

చండీగఢ్‌: ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది- ఫిబ్రవరి 14న. కానీ ఇప్పుడు జరగబోయేది- ఫిబ్రవరి 20న. ఈ ఒక్క పరిణామం చాలు.. పంజాబ్‌లో దళితుల ప్రాబల్యం చెప్పడానికి. ఫిబ్రవరి 16న వారణాసిలో నిర్వహించే గురు రవిదాస్‌ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు దళితులు అధిక సంఖ్యలో వెళ్తుంటారని, వారు ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎన్నికలను వాయిదా వేయాలని మూకుమ్మడిగా పార్టీలన్నీ విన్నవించడంతో ఈసీ పోలింగ్‌ తేదీని మార్చింది.

39 ఉప కులాలు

పంజాబ్‌ జనాభాలో దాదాపుగా మూడో వంతు ప్రజలు ఎస్సీలే. దేశంలో మరే రాష్ట్రంలోనూ వారి వాటా ఇంత ఎక్కువగా లేదు. ఇక్కడ ఎస్సీల్లోనే 39 ఉప కులాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఐదు. అవి- చమార్‌, అద్‌-ధర్మీ, బాల్మీకీ, మఝాబీ, రాయ్‌ సిఖ్‌. ఈ ఐదు ఉప కులాలకు చెందినవారే రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో 80% వరకు ఉంటారు. అద్‌-ధర్మీ, చమార్‌లలో మళ్లీ రవిదాసియాలు, రామ్‌దాసియాలు అనే వర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని దొవాబా ప్రాంతంలో దాదాపు 12 లక్షల మంది రవిదాసియాలు నివసిస్తున్నట్లు అంచనా. జలంధర్‌లోని డేరా సచ్‌ఖండ్‌ బల్లాన్‌.. రవిదాసియాలకు సంబంధించి రాష్ట్రంలో అతిపెద్ద డేరా.

అన్ని పార్టీల్లోనూ..

ప్రధానంగా దొవాబా ప్రాంతంలోని జలంధర్‌, హోశియార్‌పుర్‌, కపుర్తలా, నవాంశహర్‌ జిల్లాల్లో ఎస్సీల జనాభా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావితం చేయగలరని అంచనా. అయితే- వీరు గంపగుత్తగా ఒకే పార్టీకి మద్దతుగా ఉంటున్న దాఖలాలేవీ లేవు. ఉపకులాలు, ప్రాంతాలవారీగా.. కొన్నిచోట్ల మతపరమైన భావాల ప్రాతిపదికన కూడా వారు విడిపోయి కనిపిస్తున్నారు. వేర్వేరు పార్టీలకు అండగా నిలుస్తున్నారు. దీంతో- అన్ని పార్టీలూ ఎస్సీలను తమవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ ‘చన్నీ’ వ్యూహం

పంజాబ్‌ సీఎం పీఠంపై చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ కూర్చోబెట్టడం ఎన్నికల వ్యూహంలో భాగమే! రాష్ట్రంలో దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే. చన్నీకి కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రాధాన్యత.. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీకి అత్యంత సానుకూలాంశంగా మారబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు- సీఎం పీఠమెక్కాక చన్నీ పలు దళిత ఆకర్షక ప్రకటనలు చేశారు. గురు రవిదాస్‌ బోధనలను ప్రచారం చేసేందుకు 101 ఎకరాల్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వారసత్వానికి ప్రతీకగా అద్భుత మ్యూజియాన్ని ఏర్పాటుచేస్తానీ చెప్పారు. చన్నీ, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ జలంధర్‌లోని డేరా సచ్‌ఖండ్‌ బల్లాన్‌ను సందర్శించారు కూడా.

అకాలీదళ్‌.. బీఎస్పీతో జట్టు కట్టి!

సాగుచట్టాలపై పోరుబాటలో భాగంగా భాజపాతో బంధానికి స్వస్తి పలికిన శిరోమణి అకాలీదళ్‌.. అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)తో జట్టు కట్టింది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని అకాలీదళ్‌-బీఎస్పీ కూటమి ప్రకటించింది. అంబేడ్కర్‌ పేరిట ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని దొవాబా ప్రాంతంలో ఏర్పాటుచేస్తామని అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ గత ఏడాది హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆరాటపడుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా దళితులను ఆకర్షించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఎస్సీల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని.. పోటీ పరీక్షలకు సంబంధించి వారి కోచింగ్‌ రుసుములనూ భరిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని