సీఎం అభ్యర్థి చన్నీయే

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తొలి నుంచి రేసులో ముందున్న ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీనే ఇందుకోసం ఆ పార్టీ ఎంపిక చేసింది. లూథియానాలో ఆదివారం జరిగిన వర్చువల్‌ సభలో.....

Updated : 07 Feb 2022 07:46 IST

పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఉత్కంఠకు తెర!
ఇది రాష్ట్ర ప్రజల ఎంపికన్న రాహుల్‌ గాంధీ
స్వాగతిస్తానన్న సిద్ధూ

లూథియానా: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తొలి నుంచి రేసులో ముందున్న ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీనే ఇందుకోసం ఆ పార్టీ ఎంపిక చేసింది. లూథియానాలో ఆదివారం జరిగిన వర్చువల్‌ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం తీవ్రస్థాయిలో పోటీపడ్డ పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ తదుపరి అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు.  

‘‘ఇది నా నిర్ణయం కాదు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై పంజాబ్‌ ప్రజలు, యువత, వర్కింగ్‌ కమిటీ సభ్యులకు ప్రశ్న సంధించా. ఈ అంశంలో నా అభిప్రాయం కన్నా పంజాబ్‌ ప్రజల మనసులోని మాటే నాకు ముఖ్యం. పేదలను అర్థం చేసుకునే, అణగారిన వర్గాల బాధలు తెలిసిన వ్యక్తి పంజాబ్‌ ప్రజలకు ముఖ్యమంత్రిగా కావాలని మీరు అడిగారు. ఇది చాలా కష్టమైన నిర్ణయమే.. కానీ మీరు (ప్రజలు) దీన్ని సులభతరం చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ’’ అని రాహుల్‌ ప్రకటించారు. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్‌ జాకఢ్‌లను ఆయన ఆత్మీయంగా హత్తుకున్నారు. ఏళ్ల తరబడి పోరాటాల ద్వారా నాయకులు తయారవుతారని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అలాంటి వారికి కొదవలేదన్నారు. అంతకుముందు సిద్ధూ మాట్లాడుతూ సీఎం అభ్యర్థి విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు. వర్చువల్‌ ర్యాలీని 11 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారం, రాహుల్‌ ఫేస్‌బుక్‌ పేజి ద్వారా వీక్షించారని పార్టీ ప్రకటించింది.


ఆయనే ఎందుకంటే?

పంజాబ్‌ జనాభాలో 32 శాతం మంది దళితులు ఉన్నారు. దళితుడైన చన్నీ వారి ఓట్లను ఆకర్షించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా దళిత ముఖ్యమంత్రులు లేరు. ఈ విషయంపై కమలం పార్టీని టార్గెట్‌ చేస్తూ.. దేశవ్యాప్తంగా దళితులను ఆకట్టుకోవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆ వర్గం వారు ఎక్కువగా ఉన్న మాల్వా ప్రాంతంలో పాగా వేస్తే పంజాబ్‌లో అధికారం సాధించడం చాలా సులభమని లెక్కలు వేస్తోంది. చన్నీనీ ఆ ప్రాంతం నుంచే పోటీ చేయిస్తోంది. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా 110 రోజులకు పైగా బాధ్యతలు నిర్వర్తించిన చన్నీ.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వల్ల రాష్ట్రంలోని సాధారణ మధ్యతరగతి, పేద వర్గాలలకు సానుకూల సందేశం వెళ్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.


ఇమ్రాన్‌తో సాన్నిహిత్యం.. భాజపా ప్రచారం..

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సన్నిహితంగా మెలుగుతారన్న కారణంతో సిద్ధూను దేశ వ్యతిరేకిగా భాజపా ప్రచారం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో చన్నీనే ముందున్నట్లు తెలిసింది. పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటం కూడా సిద్ధూకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.


సిద్ధూ ఊరుకుంటారా?

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా చన్నీ ఎంపిక ఆ పార్టీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం పక్కనబెడితే.. దీని వల్ల పార్టీలో అంతర్గత కలహాలు తలెత్తుతాయా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇప్పుడు సిద్ధూ తన అడుగులు ఎటువైపు వేస్తారనేది తేలాల్సి ఉంది. ఇటీవల పార్టీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేస్తూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇక్కడ ప్రస్తావనార్హం. వాస్తవానికి అంతర్గత విభేదాల సమస్యను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్‌ అధిష్ఠానం.. ఇన్ని రోజులూ సీఎం అభ్యర్థిపై నాన్చుడు ధోరణి పాటించింది. ఇప్పటికే అన్ని పార్టీలూ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాయి. ఈ అంశంలో కాంగ్రెస్‌లో నెలకొన్న అయోమయాన్ని లక్ష్యంగా చేసుకొని విపక్షాలు ఒత్తిడి పెంచాయి. దీంతో సీఎం అభ్యర్థిని ఖరారు చేయక తప్పని పరిస్థితి హస్తం పార్టీకి ఏర్పడింది. తాజా పరిస్థితుల్లో సిద్ధూ సర్వశక్తులొడ్డి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చుతారా? లేక.. పార్టీకి పరోక్షంగా ఝలక్‌లు ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది. హైకమాండ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తానని సిద్ధూ చెప్పినప్పటికీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పార్టీలో కుమ్ములాటలు తప్పవనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించకపోతే టీవీ షో ప్రయోక్త వృత్తికి తిరిగి వెళ్తారని సిద్ధూ భార్య నవజోత్‌ కౌర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేస్తారా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏ హోదాలో రాహుల్‌ గాంధీ ప్రకటించారని భాజపా నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి పదవి లేదని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని