రిజర్వుడు సీట్లు.. అధికారానికి మెట్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చడంలో రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతిసారీ కీలకంగా మారుతున్నాయి. మెజార్టీ రిజర్వుడు సీట్లను గెల్చుకున్న పార్టీ/కూటమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం

Updated : 11 Feb 2022 05:25 IST

యూపీలో వాటిపై పార్టీల ప్రత్యేక కసరత్తులు

అభ్యర్థులకు అన్ని వర్గాల మద్దతు దక్కేలా ప్రణాళికలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చడంలో రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతిసారీ కీలకంగా మారుతున్నాయి. మెజార్టీ రిజర్వుడు సీట్లను గెల్చుకున్న పార్టీ/కూటమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో అవి ఎక్కువగా ఏ పార్టీవైపు మొగ్గుతాయన్నది ఆసక్తికరంగా మారింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో రిజర్వుడు సీట్లు 86. ఇందులో 84 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కాగా.. మరో రెండు (సోన్‌భద్ర జిల్లాలోని దుధీ, ఒబ్రా) ఎస్టీ రిజర్వుడు స్థానాలు. ఈ 86 నియోజకవర్గాల్లో గెలుపు తీరాలకు చేరుకునేందుకు అన్ని పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. వాటిలో ప్రధానంగా బీఎస్పీ, ఎస్పీ, భాజపా ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

బీఎస్పీ: మాయావతి విస్తృత ప్రచారం

గతంలో ప్రధానంగా దళితుల అండతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీఎస్పీ.. ప్రస్తుతం రిజర్వుడు స్థానాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. పార్టీ అధినాయకురాలు మాయావతి ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. అణగారినవర్గాల సంక్షేమం కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దళితులతో పాటు అగ్రవర్ణాల (ప్రధానంగా బ్రాహ్మణుల) ఓట్లను బీఎస్పీకి అనుకూలంగా సంఘటితం చేసేలా ఆమె వ్యూహాలు రూపొందించారు.

ఎస్పీ: ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందని..

2012లో మెజార్టీ రిజర్వుడు స్థానాలు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వైపు మొగ్గాయి. ఈ దఫా ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ.. ఈ సీట్లలో విజయం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. దాదాపుగా ప్రతి ఎన్నికల్లోనూ.. రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండి, తమకు వరంగా  మారాలని ఎస్పీ ఆశిస్తోంది.

భాజపా: కుల సమీకరణాలపై దృష్టి

రిజర్వుడు సీట్లలో కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని భాజపా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో, వారికి ఇతర సామాజికవర్గాల ఓటర్ల నుంచి మద్దతు కూడగట్టడంలో పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది.

మహిళల ప్రాతినిధ్యం అరకొరే..

యూపీలో రిజర్వుడు స్థానాల్లో మహిళా అభ్యర్థుల విజయాల శాతం చాలా తక్కువగా ఉండటం కలవరపెట్టే అంశం. 2007 ఎన్నికల్లో కేవలం 8 మంది స్త్రీలు ఈ సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2012లో 12 మంది, 2017లో 11 మంది మహిళలు మాత్రమే ఈ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

* యూపీలో ఎస్సీ రిజర్వుడు స్థానాల సంఖ్య 2004లో 89గా ఉండేది. 2008లో ఆ సంఖ్యను 85కు తగ్గించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ఎస్సీ రిజర్వుడు స్థానాలను 84కు తగ్గించి, మరో రెండింటిని ఎస్టీ రిజర్వుడు సీట్లుగా గుర్తించారు.

* జనరల్‌ స్థానాలతో పోలిస్తే రిజర్వుడు సీట్లలో పార్టీలు కొంత భిన్నమైన వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసేది ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులే అయినా.. వారి భవితవ్యం అన్ని సామాజికవర్గాల ఓటర్ల చేతుల్లో ఉంటుంది! కాబట్టి ఎస్సీ/ఎస్టీయేతర వర్గాలనూ ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని