అతివకు దక్కని ఆదరణ

మణిపుర్‌ మహిళలకు శ్రమజీవులుగా పేరుంది. కుటుంబ పోషణలో వారి పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ.

Updated : 26 Feb 2022 05:58 IST

మణిపుర్‌లో టికెట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం కరవు
ఇంఫాల్‌ నుంచి ఈనాడు ప్రతినిధి

మణిపుర్‌ మహిళలకు శ్రమజీవులుగా పేరుంది. కుటుంబ పోషణలో వారి పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. అయినప్పటికీ రాజకీయాల్లో వారికి తగినంత ప్రాధాన్యం దక్కడం లేదు. ఎన్నికల్లో పోటీకి సంబంధించి టికెట్ల కేటాయింపులో పార్టీలు వారిపై శీతకన్ను వేస్తున్నాయి.

మణిపుర్‌లో మొత్తం 60 శాసనసభ స్థానాలున్నాయి. అయితే- 2017లో ఇద్దరు స్త్రీలు మాత్రమే (భాజపా, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కొక్కరు) ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజా ఎన్నికల్లోనూ అతివలకు టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీల్లో విముఖత కనిపించింది! ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 265 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో మహిళలు కేవలం 17 మంది. ప్రధాన పార్టీలలో.. కాంగ్రెస్‌ 4, భాజపా 3 టికెట్లను మాత్రమే స్త్రీలకు కేటాయించాయి. మాజీ పోలీసు అధికారిణి థౌనావొజమ్‌ బృంద ప్రస్తుతం వైస్కుల్‌ నియోజకవర్గంలో జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మణిపుర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేడర్‌కు చెందిన ఈమె.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు. ‘లేడీ సూపర్‌ కాప్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఓ కీలక కేసులో నిందితులు విడుదలవడంతో తీవ్ర అసంతృప్తి గురై.. బృంద తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

600 పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిగా మహిళా సిబ్బంది

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ మణిపుర్‌ శాసనసభ ఎన్నికల్లో పూర్తిగా మహిళలతోనే పనిచేసేలా 600 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రాజేశ్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రతి ఐదింటిలో ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పూర్తిగా అతివలే నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని