పూర్వాంచల్‌లో పట్టం ఎవరికో!

ఉత్తర్‌ప్రదేశ్‌లో పశ్చిమాన మొదలైన పోలింగ్‌ ప్రక్రియ.. ఒక్కో విడత ముగిసేకొద్దీ తూర్పు దిశగా సాగుతోంది. మధ్య యూపీలోని మెజార్టీ నియోజకవర్గాలకు నాలుగో దశలో ఎన్నికలు ముగియగా..

Updated : 26 Feb 2022 05:57 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో పశ్చిమాన మొదలైన పోలింగ్‌ ప్రక్రియ.. ఒక్కో విడత ముగిసేకొద్దీ తూర్పు దిశగా సాగుతోంది. మధ్య యూపీలోని మెజార్టీ నియోజకవర్గాలకు నాలుగో దశలో ఎన్నికలు ముగియగా.. ఐదో దశతో పూర్వాంచల్‌ (తూర్పు యూపీ)లో పోరు ప్రారంభం కానుంది. అవధ్‌, పూర్వాంచల్‌ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాలకు ఐదో విడతలో పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల తరహాలో ఈ దశలోని సీట్లలో మరోసారి సత్తా చాటాలని అధికార భాజపా తహతహలాడుతుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని ఆ పార్టీపై పైచేయి సాధించాలన్న ప్రణాళికలతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ముందుకెళ్తోంది. ప్రస్తుతమిక్కడ ఆయా పార్టీల పరిస్థితి ఎలా ఉందన్నది పరిశీలిస్తే..


భాజపా: అయోధ్య రాముడిపై ఆశలు

పూర్వాంచల్‌ రాజకీయాల్లో ‘అయోధ్య రామమందిరం’ చాలా ముఖ్యమైన అంశం. యూపీలో 1990ల్లో భాజపా అధికారంలోకి రావడంలో అది అత్యంత కీలక పాత్ర పోషించింది. మందిర నిర్మాణం గత ఏడాది ప్రారంభమవడం కమలదళానికి సానుకూలాంశం. అందుకే ఒకప్పటి స్థాయిలో కాకున్నా.. ఇప్పటికీ ప్రచారంలో రామమందిర అంశాన్ని కమలనాథులు ప్రస్తావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తొలి మూడు విడతల్లో భాజపా వెనుకబడిందని విశ్లేషణలు వస్తున్నాయి. అవధ్‌, పూర్వాంచల్‌ ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని కమలనాథులు చూస్తున్నారు. అయితే పోషణ భారమై ప్రజలు వదిలేస్తున్న గోవులు, ఇతర పశువులు ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన ప్రధాని మోదీ.. ఆ సమస్యను అధిగమించేందుకు కొత్త పథకాన్ని తీసుకొస్తామని ఇటీవల బహ్రాయిచ్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రకటించారు. వట్టిపోయిన గోవుల పోషణ బాధ్యతలు చూసుకువారికి ఆర్థిక సహాయం చేస్తామని సీఎం యోగి చెప్పారు.


ఎస్పీ: ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని..

అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ.. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతపైనే ఈ దశలో ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. కీలకమైన అయోధ్య మందిరం అంశం గురించి గతంలో ఆ పార్టీ నేతలు ఇక్కడ ప్రచారంలో విస్తృతంగా మాట్లాడేవారు. తద్వారా మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలేశ్‌.. వ్యూహాత్మకంగా ఆ అంశాన్ని ర్యాలీల్లో ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నాయకత్వంలోని సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) తమ మిత్రపక్షంగా ఉండటం ఈ ప్రాంతంలో అఖిలేశ్‌ పార్టీకి కలిసొచ్చే అంశం.తాము అధికారంలోకి వస్తే.. పశువుల నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఐదో విడతలో పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. మొత్తం 61 సీట్లకుగాను 39 చోట్ల విజయ పతాకం ఎగరేసింది.


బీఎస్పీ: తాను గెలవకపోయినా..!

పూర్వాంచల్‌లో బీఎస్పీకి చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉంది. తాను గెలవలేకపోయినా.. చాలా స్థానాల్లో ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీయగల బలం ఆ పార్టీ సొంతం. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గారు. 2012 ఎన్నికల నుంచి మాత్రం వారు భాజపాకు అండగా నిలుస్తున్నారు. బ్రాహ్మణులతోపాటు జాతవ్‌, జాతవేతర దళితులను తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు బీఎస్పీ ఈ దఫా పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ మైనారిటీ అభ్యర్థులను బరిలో దించిన పలు స్థానాల్లో.. బీఎస్పీ కూడా అదే సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థులకు టికెట్‌ కేటాయించింది.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని