సాయిగణేష్‌ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు?

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండతో మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు భాజపా కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర

Updated : 18 Apr 2022 05:45 IST

భాజపా కార్యకర్తలపై కక్ష సాధింపు

ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్‌

మానవపాడు, అలంపూర్‌, ఉండవల్లి- న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండతో మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు భాజపా కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ధర్మం కోసం, అవినీతిపై చట్టాలకు లోబడి పోరాటం చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన భాజపా కార్యకర్త సాయి గణేష్‌పై స్థానిక మంత్రి అండదండలతో పోలీసులు 15కు పైగా కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్‌ తెరవడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడడం కలచి వేసిందన్నారు. సాయి గణేష్‌ మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానిక మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు బయటపెడితే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వాంగ్మూలం తీసుకోలేదని ఆరోపించారు. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరుపేద సాయిగణేష్‌ కుటుంబాన్ని భాజపా అన్ని విధాలుగా ఆదుకుంటుందని సంజయ్‌ భరోసా ఇచ్చారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామశివారులోని పాదయాత్ర శిబిరం వద్ద సాయిగణేష్‌ చిత్రపటానికి సంజయ్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదివారం ఆయన జల్లాపురం, బోరవెల్లి గ్రామాలతో పాటు జాతీయ రహదారి 44పై యాత్ర కొనసాగించారు. జల్లాపూర్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం అండదండలతో తెరాస నేతలు, కొందరు పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించడంతో సాయిగణేష్‌ బలి అయ్యారన్నారు. తెరాస ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయం కొంతమంది పోలీసు అధికారులు గుర్తించి, చట్టానికి లోబడి పని చేయాలన్నారు. బోరవెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాబోయే సీఎం బండి సంజయ్‌ అనడంతో ఒక్కసారిగా నాయకులు, కార్యకర్తలు ఈలలు వేశారు.


ఆ పోలీసులు గులాబీ కండువా కప్పుకోవాలి: డీకే అరుణ

ఈనాడు, హైదరాబాద్‌ : తెరాస నాయకులు, పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో భాజపా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల మృతికి కారకులవుతున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఇలా వ్యవహరిస్తున్న పోలీసులు తమ యూనిఫాం వదిలేసి గులాబీ కండువా కప్పుకోవాలని ఆమె అన్నారు. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి, కొడుకుల ఆత్మహత్య.. ఖమ్మం జిల్లాలో భాజపా కార్యకర్త మృతిపై డీకే అరుణ ఆదివారం ఓ ప్రకటనలో స్పందించారు. వారి ఆత్మహత్యలకు కారణమైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.


మంత్రి పువ్వాడ వేధింపులతోనే బలవన్మరణం

ఖమ్మం సీపీలో యువకుడి అమ్మమ్మ ఫిర్యాదు

మరో తెరాస నేత, సీఐపైనా ఆరోపణలు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ భర్త, తెరాస నాయకుడు ప్రసన్న కృష్ణ, మూడో పట్టణ సీఐ వేధింపులు తట్టుకోలేకే భాజపా అనుబంధ మజ్దూర్‌ యూనియన్‌ ఖమ్మం జిల్లా కన్వీనర్‌ సామినేని సాయిగణేశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని గణేశ్‌ అమ్మమ్మ సావిత్రి ఆరోపించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కార్యదర్శి రుద్ర ప్రదీప్‌ తదితరులు ఫిర్యాదు ప్రతిని పోలీసులకు అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని