జైపుర్‌లో భాజపా భేటీలు

జాతీయస్థాయిలో భాజపా సంస్థాగత కమిటీ నేతల కీలక సమావేశాలు మే 20, 21 తేదీల్లో రాజస్థాన్‌లోని జైపుర్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు రాబోయే ఎన్నికల వ్యూహాల గురించి చర్చించనున్నట్లు పార్టీ

Updated : 05 May 2022 05:54 IST

కాంగ్రెస్‌ ‘చింతన్‌ శిబిర్‌’ ముగిసిన వెంటనే 20, 21 తేదీల్లో నిర్వహణ

దిల్లీ: జాతీయస్థాయిలో భాజపా సంస్థాగత కమిటీ నేతల కీలక సమావేశాలు మే 20, 21 తేదీల్లో రాజస్థాన్‌లోని జైపుర్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు రాబోయే ఎన్నికల వ్యూహాల గురించి చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం కూడా ఉంటుంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు పార్టీలోని జాతీయ కార్యవర్గ ప్రతినిధులు, రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత కమిటీల బాధ్యులు, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. 2020లో కొవిడ్‌ మహమ్మారి మొదలయ్యాక పార్టీపరంగా తరచూ వర్చువల్‌ భేటీలే జరుపుతున్నారు. గత రెండేళ్లలో భౌతికంగా జరుగుతున్న విస్తృతస్థాయి తొలి సమావేశం ఇదే. తొలిరోజు నేతలందరి సమావేశం ఉంటుంది. మరుసటిరోజు రాష్ట్రస్థాయి సంస్థాగత ప్రధాన కార్యదర్శులు ప్రత్యేకంగా భేటీ అవుతారు. సమావేశాల ఎజెండా తరవాత పంపుతామని, ముందుగా ఆయా రాష్ట్రాల్లో పార్టీపరంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికలు పంపాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు (సంస్థాగత) సమాచారం పంపారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో భాజపా కీలక సమావేశాలు నిర్వహించతలపెట్టడం వ్యూహంలో భాగమే. రాష్ట్రంలో పలుచోట్ల ఇటీవల జరిగిన మత ఘర్షణలతోపాటు పలు సమస్యలపై అశోక్‌ గెహ్లోత్‌ సర్కారును ఇరుకున పెట్టాలని భాజపా చూస్తోంది. మరోవైపు.. ఇదే రాష్ట్రంలోని ఉదయ్‌పుర్‌లో మే 13 నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్‌ పార్టీ ‘చింతన్‌ శిబిర్‌’ నిర్వహించనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుచోట్ల భాజపా ఘనవిజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని