చేరికలపై కాంగ్రెస్‌ నజర్‌

పార్టీ బలోపేతంతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంపై పీసీసీ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో

Published : 20 May 2022 05:36 IST

ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: పార్టీ బలోపేతంతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంపై పీసీసీ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలో ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల రాష్ట్ర పర్యటనలో కూడా చేరికలపై కీలకనేతలతో చర్చించారు. పార్టీకి లాభం కలిగించేలా చేరికలు ఉండాలని, స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకోవాలని పేర్కొనడంతో పాటు రాజకీయ కోణంలో వ్యతిరేకిస్తే పార్టీ ప్రయోజనాన్నే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీలో అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీల సమక్షంలోనే ప్రధాన చేరికలుండేలా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటగా రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలపై దృష్టి సారించామని పీసీసీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అనే పరిస్థితి ఉంటే వాటిపై సీనియర్‌ నాయకుడు జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.

ఓదెలు దిల్లీ చేరే వరకు రహస్యంగానే ఆపరేషన్‌
అధికార తెరాసకు చెందిన జడ్పీ ఛైర్‌పర్సన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేలా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చేరిక విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గురువారం పార్టీలో చేరడానికి ముందు మాత్రమే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. చెన్నూరు నియోజకవర్గంలో గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వెంకటేష్‌ నేత తర్వాత తెరాసలో చేరి పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో చెన్నూరులో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఎదురైంది. తెరాసలో గత ఎన్నికల్లో టికెట్‌ దక్కని నల్లాల ఓదెలుపై దృష్టిసారించారు. ఆయన సతీమణి భాగ్యలక్ష్మి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నా తెరాసలో స్థానికంగా ఉన్న ఇబ్బందికర పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో పోటీయే లక్ష్యంగా వారు కాంగ్రెస్‌లో చేరారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని