తెలంగాణలోనూ పోటీ చేస్తాం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టతనిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన కార్యకర్త యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని లక్కారంలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. సైదులు భార్య సుమతికి...

Updated : 21 May 2022 06:22 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

చౌటుప్పల్‌ గ్రామీణం, కోదాడ, ఆర్కేపురం, న్యూస్‌టుడే: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టతనిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన కార్యకర్త యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని లక్కారంలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. సైదులు భార్య సుమతికి రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. అనంతరం పవన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 20 నుంచి 30 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో జనసేనకు అయిదారువేల ఓట్లున్నాయని, ఇవి గెలుపోటములను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో సామాజిక మార్పులు జరగాలని, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ఫలాలు అందాలని ఆకాంక్షించారు. వారసత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఇకపై రాష్ట్రంలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని తీసుకొని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ పెట్టి దెబ్బతిన్న వాడిని.. ఒక పార్టీ నిర్మాణం జరగాలంటే చాలా కష్టపడాలి. ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పవన్‌ వ్యాఖ్యానించారు. చౌటుప్పల్‌లో అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించారు. అంతకుముందు సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ చౌరస్తాలో పవన్‌ కల్యాణ్‌ కొద్దిసేపు ఆగారు. నగర శివారు ఆర్కేపురం డివిజన్‌ మీదుగా చౌటుప్పల్‌కు వెళ్తున్న ఆయనకు అలకాపురి కూడలిలో జనసేన కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కారం జరిపారు. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

కోదాడలో అపశ్రుతి.. అభిమానికి గాయాలు

పవన్‌కల్యాణ్‌ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోకి రాగానే అభిమానులు స్వీయచిత్రాలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు సుమారు 10 ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పవన్‌ను కలిసే క్రమంలో కొమరబండ వద్ద రసూల్‌ అనే అభిమాని జారి కిందపడగా ఆయన పైనుంచి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు.  


భాజపాను ఒప్పిస్తా..

అమరావతి: ఆ తర్వాత ఆయన ఏపీలోని మంగళగిరిలో మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భాజపాను సైతం ఒప్పిస్తా. రాష్ట్రం బాగుండాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కనీస ఉమ్మడి కార్యక్రమంతో అందరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నా.’’ అని అన్నారు. తెలంగాణలో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని