మోదీ అంటే కేసీఆర్‌కు వణుకు

తెరాస పాలనలో రాష్ట్రంలో రైతులు సహా వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటే బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర రాష్ట్రాల రైతు కుటుంబాలకు ఆర్థిక

Published : 22 May 2022 05:14 IST

ప్రధాని వస్తున్నారనే ఇతర రాష్ట్రాలకు

తెరాస పనైపోయింది.. కేటీఆర్‌ భాష హాస్యాస్పదం

బండి సంజయ్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస పాలనలో రాష్ట్రంలో రైతులు సహా వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటే బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర రాష్ట్రాల రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి వెళ్లడం ప్రచారం కోసమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ 26న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున ఘన స్వాగతం పలికేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలు, కార్పొరేటర్లతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజగజలాడుతున్నారని.. ఆయన వస్తున్నారని తెలిసి ఇతర రాష్ట్రాలకు పారిపోయారని వ్యాఖ్యానించారు. ‘దిల్లీలో చనిపోయిన రైతులకు ఆర్థికసాయం చేస్తారట.. ఇక్కడ వేలాది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికిపైగా పేదలు మరణిస్తే ఆదుకోలేదు. ఇతర రాష్ట్రాల రైతుల కోసం వెళ్లిన మీ తీరుచూసి జనం అసహ్యించుకుంటున్నారు’ అంటూ సీఎంపై సంజయ్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తెరాస పని అయిపోయిందని.. కేటీఆర్‌ భాష, వ్యవహరిస్తున్న తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు.

రాజధానిని కాషాయమయం చేద్దాం..
‘హైదరాబాద్‌లో ప్రధానికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుదాం. విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు ఆయన వెళ్లే మార్గంలో వేలమందితో అపూర్వ స్వాగత ఏర్పాట్లు ఉండాలి. రాజధానిని హోర్డింగులు, ఫ్లెక్సీలతో కాషాయమయం చేద్దాం. అందుకోసం ప్రతి డివిజన్‌లో సమావేశం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలను సమాయత్తం చేయాలి’ అని నేతలకు సంజయ్‌ సూచించారు.

పెట్రో, గ్యాస్‌ ధర తగ్గింపు సాహసోపేత నిర్ణయం
దేశంలో పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల తగ్గింపు సాహసోపేత నిర్ణయమని, ఎరువుల రాయితీకి అదనంగా రూ.1.10 లక్షల కోట్లు వెచ్చించడం.., స్టీలు, సిమెంట్‌ ధరల నియంత్రణ చరిత్రాత్మకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు.

జూన్‌ 23 నుంచి.. మూడో విడత పాదయాత్ర
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత పాదయాత్ర ప్రారంభ తేదీ ఖరారైంది. జూన్‌ 23 నుంచి అది మొదలు కానుంది.  పాదయాత్ర ప్రారంభించే ప్రాంతం, ముగించే చోటు, రూట్‌ మ్యాప్‌ అంశాలపై ఈ నెల 23న జరిగే పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. యాదాద్రి ఆలయం నుంచి భద్రకాళి ఆలయం వరకు.. భద్రాద్రి నుంచి ఖమ్మం వరకు ఇలా రెండు, మూడు ప్రతిపాదనల్ని పార్టీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు