ఇక్కడి రైతులను ఆదుకోకుండా పంజాబ్‌లో సాయమా?

తెలంగాణలో రైతు, ఇతర కుటుంబాలను ఆదుకోని కేసీఆర్‌ పంజాబ్‌లో అన్నదాతలకు సహాయం చేస్తుండటం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేవలం మీడియాలో ఉండటం

Published : 23 May 2022 04:33 IST

బండి సంజయ్‌ విమర్శ

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: తెలంగాణలో రైతు, ఇతర కుటుంబాలను ఆదుకోని కేసీఆర్‌ పంజాబ్‌లో అన్నదాతలకు సహాయం చేస్తుండటం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేవలం మీడియాలో ఉండటం కోసమే దేశంలో సంచలనం సృష్టిస్తానని వ్యాఖ్యలు చేస్తారు తప్ప ఆయనతో ఏమీకాదన్న విషయం అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణలో లేకపోవడమే సంచలనమని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లో హిందూ ఏక్తాయాత్ర ఏర్పాట్లను సంజయ్‌ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎక్కడో ఉన్న రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వ్యాట్‌ తగ్గిస్తే రాష్ట్రంలో రూ.80కే లీటరు పెట్రోలు లభిస్తుందన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుండటంతో ముఖం చూపించలేక కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రధాని వస్తే ముఖ్యమంత్రి వెళ్లలేదని, జ్వరం వచ్చిందన్నారని ఆరోపించారు. ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియదని, పేదలకు పింఛను ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బాధితుల వంక చూడలేదని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎందరో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, కనీసం వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్‌ విద్యార్థులు చనిపోయారని, మృతుల కుటుంబీకులు ఆందోళన చేస్తే వారిపై లాఠీఛార్జి చేయించారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని, ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు వరి కుప్పలపైనే కుప్పకూలారని ఆవేదన చెందారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో గడిపారని ఎద్దేవా చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాయని తెలంగాణలో కూడా తగ్గించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని