Published : 23 May 2022 04:33 IST

పెంచింది 300%.. తగ్గించింది 30 శాతమే

కేంద్రం సెస్‌లు తగ్గిస్తే రూ.70కే లీటరు పెట్రోలు
ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను 300 శాతం పెంచి... 30 శాతం తగ్గించిందని, ఇదంతా కంటితుడుపు చర్యేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఆదివారం దావోస్‌ నుంచి ట్విటర్‌లో ధ్వజమెత్తారు. 2014, 2022 సంవత్సరాలలో ముడి చమురు ధరలు ఒకేలా ఉన్నాయని, అప్పట్లో పెట్రోలు లీటరు రూ.70 కాగా.. ఇప్పుడు రూ.120 ఎలా అయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో వ్యాట్‌ పెరగలేదని, కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇంధన ధరలు పెరిగాయని వివరించారు. ‘‘2014లో పెట్రోలుపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూ.3.57 కాగా దాన్ని కేంద్రం 2022 నాటికి రూ.27.90కి పెంచింది. తాజాగా పెట్రోలుపై తగ్గించింది రూ.8 మాత్రమే.. అదేవిధంగా డీజిల్‌పై 2014లో ఎక్సైజ్‌ డ్యూటీ రూ.3.57 కాగా 2022 నాటికి దాన్ని రూ.21.80కి పెంచింది. ఇప్పుడు తగ్గించింది రూ.6 మాత్రమే. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఇంధన సెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. కేంద్రం వసూలు చేస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్లు, మౌలిక వసతుల సెస్‌, వ్యవసాయ అభివృద్ధి సెస్‌, ఇతర సెస్‌ల వల్లనే ఇంధన ధరలు మనదేశంలో అత్యధికంగా ఉన్నాయి. వీటిని తగ్గిస్తే 2014లో మాదిరిగా పెట్రోలు లీటరు 70 రూపాయలకే లభిస్తుంది. నా చిన్నతనంలో మా పాఠశాల పక్కన ఒక దుకాణం ఉండేది. విద్యార్థుల రద్దీ సమయంలో దాని యజమాని తినుబండారాల ధరలను ఏకంగా 300 శాతం పెంచేసేవాడు. అందరూ గట్టిగా అడిగితే 30 శాతం తగ్గించేవాడు. ఇది చూసి అతని సన్నిహితులు దానిని బంపర్‌ ఆఫర్‌గా అభివర్ణించడం ప్రారంభించి, అతనికి ధన్యవాదాలు చెబుతూ నిజాలు తెలియకుండా హడావిడి చేసేవారు. ఇప్పుడు కేంద్రం తీరు అలాగే ఉంది. ఇకనైనా కేంద్రం సెస్‌లు తగ్గించి పెట్రో ధరలను 2014లో ఉన్నట్లు మార్చాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ఇంధనాల ధరల తగ్గుదలను కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కానీ కేంద్రం నిర్ణయం వల్ల రాష్ట్రాలకు రాబడి తగ్గుతుంది. ఇంధన ఎక్సైజ్‌ డ్యూటీపై 42 శాతం వాటా రాష్ట్రాలది. నిన్నటి కోతలతో రాష్ట్రాలు పెట్రోలుపై రూ.2.52, డీజిల్‌పై రూ.3.36 రాబడిని కోల్పోతున్నాయి’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

దావోస్‌ చేరుకున్న కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ లండన్‌ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి దావోస్‌ చేరుకున్నారు. సోమవారం నుంచి 4 రోజుల పాటు ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచంలోని పలు ప్రతిష్ఠాత్మక కంపెనీలతో సమావేశమవుతారు. లండన్‌లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం దావోస్‌ పర్యటన సందర్భంగా కేటీఆర్‌కు బ్రిటన్‌లోని లండన్‌ హీత్రో విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తెరాస ప్రవాస విభాగం అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం, ఇతర ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి మంత్రి కేటీఆర్‌ ముందుగా జ్యూరిక్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో దావోస్‌కు చేరుకున్నారు. అక్కడ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆర్థిక వేదిక సదస్సు అనంతరం పలు చర్చాగోష్ఠుల్లో, 26న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.


ప్రగతిశీల పథకాలు, శాఖల కృషితో ఈవోడీబీలో పురోగమనం

‘‘తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల నిరంతర కృషి, ప్రగతిశీల పథకాల అమలు వల్ల తెలంగాణ సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) చార్టుల్లో ఏళ్ల తరబడి అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడింది’’ అని కేటీఆర్‌ తెలిపారు. దావోస్‌ చేరుకున్న తర్వాత ఆయన ఈ ట్వీట్‌ చేశారు.


భాజపా 700 మందిని పొట్టన పెట్టుకుంది
ట్విటర్‌లో ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నల్ల చట్టాలతో తీరని అన్యాయం చేసి 700 మందికి పైగా రైతుల చావుకు కారణమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ‘కేంద్ర మంత్రి కుమారుడు.. రైతులను జీపుతో తొక్కించి చంపినా స్పందించని సంస్కృతి భారతీయ జనతా పార్టీది. కానీ సీఎం కేసీఆర్‌ అన్నదాతలను కడుపులో పెట్టి చూసుకుంటున్నారు’’ అని ఆమె తెలిపారు. నల్లచట్టాలపై పోరులో అమరులైన రైతుల కుటుంబాలకు కేసీఆర్‌ ఆదివారం చండీగఢ్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ఫొటోలను కవిత ట్విటర్‌కు జత చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts