కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు బెదరం

తెరాస ప్రభుత్వంపై వ్యతిరేక పవనాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీకి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో భాజపా బలపడటాన్ని జీర్ణించుకోలేకే ఇలా చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు దిక్కులేదు కానీ.. పంజాబ్‌ రైతులకు సాయం పేరిట తిరుగుతారా? అంటూ ప్రశ్నించారు. అటల్‌ బిహారి వాజ్‌పేయీ(ఏబీవీ) ఫౌండేషన్‌ నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ పొందిన మహిళలకు...

Updated : 23 May 2022 06:48 IST

సంచలనాలు ప్రగతిభవన్‌, ఫాంహౌస్‌కే పరిమితం
కల్వకుంట్ల కుటుంబానికి ప్రజల చీదరింపు తప్పదు
సీఎంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వంపై వ్యతిరేక పవనాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీకి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో భాజపా బలపడటాన్ని జీర్ణించుకోలేకే ఇలా చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు దిక్కులేదు కానీ.. పంజాబ్‌ రైతులకు సాయం పేరిట తిరుగుతారా? అంటూ ప్రశ్నించారు. అటల్‌ బిహారి వాజ్‌పేయీ(ఏబీవీ) ఫౌండేషన్‌ నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ పొందిన మహిళలకు ఆదివారమిక్కడ సర్టిఫికెట్లు అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ దిల్లీలో ఎన్నిరోజులైనా ఉండొచ్చు. మాకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడం. మాది కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడే పార్టీ కాదు. యూపీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రజలు చీదరించుకున్న పార్టీలను కలుస్తున్నారు. రేపు కల్వకుంట్ల కుటుంబానికీ చీదరింపు తప్పదు. తుపాన్‌.. భూకంపం సృష్టిస్తా అంటూ కేసీఆర్‌ గతంలో చాలాసార్లు సంచనాలు సృష్టించారు. అవి ప్రగతిభవన్‌కు, ఫాంహౌస్‌కే పరిమితం. కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానంపై సీఎంకు అవగాహన లేదు. మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేలా, విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా మంచి విధానం తెచ్చాం. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏది? దిల్లీకి వచ్చి మాకు ఉపన్యాసాలు చెప్పొద్దు. ఇళ్ల పథకంలోనూ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎందరు పేదలున్నా గృహాల మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఏపీలో  30 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. కరోనా నాలుగో ఉద్ధృతి రాదన్న విశ్వాసం నాకుంది. ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలతో ఉండాలి’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, నేతలు చింతల రామచంద్రారెడ్డి, గౌతంరావు, శ్యాంసుందర్‌గౌడ్‌, కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మధుప్రియ పాల్గొన్నారు.

కిషన్‌రెడ్డిని కలిసిన గద్దర్‌

మహిళలకు ఏబీవీ సర్టిఫికెట్ల కార్యక్రమం పంపిణీ చేస్తున్న సమయంలో ప్రజాగాయకుడు గద్దర్‌ వచ్చారు. ఇది మహిళలకు సంబంధించిందిన కార్యక్రమం వేదిక పైకి రావాలని ఆయన్ను కిషన్‌రెడ్డి ఆహ్వానించగా గద్దర్‌ స్త్రీల గొప్పతనంపై పాట పాడారు. అనంతరం తనపై కేసులకు సంబంధించిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి ఆయన అందజేశారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తుక్కుగూడ సభకు వచ్చిన సందర్భంలోనూ కేసులకు సంబంధించి వినతిపత్రాన్ని ఇచ్చారు.


వ్యాట్‌ తగ్గించడానికి ఇబ్బందేమిటి?: డీకే అరుణ
 

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో చెప్పాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణ ప్రశ్నించారు. ఏటా రూ.లక్ష కోట్ల ఆదాయం పోతున్నా కేంద్రం ప్రజల కోసం ఆలోచించి పెట్రో ధరల్ని తగ్గించిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలపైనున్న భారం గురించి ఆలోచించట్లేదని ఆమె ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని