కాంగ్రెస్‌ తీన్‌మార్‌!

వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతను కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. ఈ నెల 13, 14 15 తేదీల్లో ఉదయ్‌పుర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా మంగళవారం మూడు కమిటీల ఏర్పాటును పార్టీ ప్రకటించింది. కీలక అంశాలపై మార్గదర్శకానికి రాజకీయ

Published : 25 May 2022 06:23 IST

3 కమిటీలను ప్రకటించిన సోనియాగాంధీ

ఈనాడు, దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతను కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. ఈ నెల 13, 14 15 తేదీల్లో ఉదయ్‌పుర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా మంగళవారం మూడు కమిటీల ఏర్పాటును పార్టీ ప్రకటించింది. కీలక అంశాలపై మార్గదర్శకానికి రాజకీయ వ్యవహారాల కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ - 2024లతోపాటు వచ్చే అక్టోబరు 2 నుంచి కన్యాకుమారి మొదలు కశ్మీర్‌ వరకు చేపట్టే ‘భారత్‌ జోడో’ యాత్ర నిర్వహణ కోసం మరో కమిటీని ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ నేతృత్వంలో పనిచేసే రాజకీయ వ్యవహారాల బృందంలో సభ్యులుగా రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌, అంబికా సోని, దిగ్విజయ్‌సింగ్‌, ఆనంద్‌శర్మ, కేసీ వేణుగోపాల్‌, జితేంద్రసింగ్‌ నియమితులయ్యారు. ముఖ్యమైన రాజకీయ పరిస్థితులపై చర్చించి పార్టీ అనుసరించాల్సిన ఉమ్మడి విధానాన్ని ఈ బృందం ఖరారు చేస్తుంది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌లో ముకుల్‌ వాస్నిక్‌, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మకెన్‌, ప్రియాంకాగాంధీ వాద్రా, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, సునీల్‌ కనుగోలు నియమితులయ్యారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులకు పార్టీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్‌, మీడియా, ప్రజలకు చేరువ కావడం, ఆర్థికవనరుల సమీకరణ, ఎన్నికల నిర్వహణ లాంటి బాధ్యతలను ఒక్కొక్కరికి ఒక్కో బృందాన్ని అప్పగిస్తారు. ఆ పేర్లను తర్వాత వెల్లడిస్తారు. నవసంకల్ప్‌ డిక్లరేషన్‌తోపాటు ఆరు గ్రూపులు ఇచ్చిన నివేదికల్లోని అంశాల అమలు తీరును ఈ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తుంది. అక్టోబర్‌ 2 నుంచి మొదలయ్యే భారత్‌ జోడో యాత్ర పర్యవేక్షణ కోసం దిగ్విజయ్‌సింగ్‌ నేతృత్వంలో సెంట్రల్‌ ప్లానింగ్‌ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రవ్‌నీత్‌సింగ్‌ బిట్టు, కె.జె.జార్జ్‌, జ్యోతిమణి, ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌, జితూ పట్వారీ, సలీం అహ్మద్‌ సభ్యులుగా నియమితులయ్యారు. ఇందులో టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘాల అధినేతలు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు.

50 ఏళ్లలోపు వారికి 50% పదవులు ఉత్తమాటే!

ఇక నుంచీ కాంగ్రెస్‌ పార్టీలోని అన్ని కమిటీల్లో 50 ఏళ్లలోపు వారికి 50% పదవులు కట్టబెట్టాలని చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఏర్పాటైన కమిటీల్లో కనిపించలేదు. రాజకీయ వ్యవహారాల కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ బృందాల్లో ఇప్పటివరకూ పార్టీ పదవుల్లో ఉన్న పాత నేతలే తప్ప కొత్తవారెవరూ లేరు. హైదరాబాద్‌ కేంద్రంగా మైండ్‌షేర్‌ అనలిటిక్స్‌ సంస్థను నిర్వహిస్తున్న సునీల్‌ కనుగోలును టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడిగా తీసుకొచ్చారు. ఈయన స్వతహాగా కాంగ్రెస్‌ సభ్యుడు కాదు. ప్రశాంత్‌ కిశోర్‌ బృందంలో ఒకరిగా ఉండి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. భారత్‌ జోడో యాత్ర కోసం ఏర్పాటుచేసిన 9 మంది సభ్యుల కమిటీలో మాత్రం 50 ఏళ్లలోపువారైన సచిన్‌ పైలట్‌, రవ్‌నీత్‌సింగ్‌ బిట్టు, జ్యోతిమణి, జీతు పట్వారీలకు అవకాశం కల్పించారు. పి.చిదంబరం సారథ్యంలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తొలి సమావేశం మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని