ఒంగోలు.. పసుపువర్ణ శోభితం

తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు ఒంగోలులోని మండువవారిపాలెం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ

Published : 26 May 2022 05:18 IST

తెలుగుదేశం మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు

నేడు మంగళగిరి నుంచి చంద్రబాబు భారీ ర్యాలీ

27న పార్టీ ప్రతినిధుల సభ

28న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల ప్రారంభం

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు ఒంగోలులోని మండువవారిపాలెం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం 83 ఎకరాల్లో సభావేదిక, ప్రాంగణం ఇప్పటికే పూర్తయ్యాయి. 20 వరకు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి కుడివైపున ఫొటో గ్యాలరీ, రక్తదాన శిబిరం, మీడియా పాయింట్‌, వీఐపీల భోజనాలకు ఏర్పాటు చేశారు. వెనుకవైపు దాదాపు 500కు పైగా వీఐపీల వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యేవారి భోజనాల కోసం ప్రత్యేకంగా మరో ప్రాంగణం రూపుదిద్దుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ చిత్రాలతో 20 భారీ స్థాయి పసుపు రంగు బెలూన్లు ఎగరవేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాలకు 53 ఎకరాల్లో ప్రత్యేక పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సభ్యత్వ నమోదు కౌంటర్లు ఆకర్షణీయంగా రూపొందించారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని కూలర్లు.. ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేర్వేరుగా గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటుచేశారు. బుధవారం సాయంత్రం మహానాడు ప్రాంగణానికి వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. నలభయ్యేళ్ల తెలుగుదేశం చరిత్ర.. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడులకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరికీ కనిపించేలా గ్యాలరీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.  ఇది తెలుగు ప్రజలందరి పార్టీ అని.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మహానాడుకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇవీ కార్యక్రమాలు..
* గురువారం ఒంగోలులో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఉదయం మంగళగిరి నుంచి చంద్రబాబు ఒంగోలుకు బయలుదేరనున్నారు.

* 27న ఉదయం 9.30 గంటలకు మండువవారిపాలెంలోని మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రతినిధుల సభ ఉంటుంది. 

* 28న ఉదయం 9.30 గంటలకు అద్దంకి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించి శతజయంతి వేడుకలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 11 గంటలకు అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మహానాడు ప్రాంగణానికి చేరుకుని సభ అనంతరం రాత్రి విజయవాడ బయలుదేరి వెళతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని