Insurance: ధీమాగానే ఉన్నారా?

కరోనా మహమ్మారి మనకు నేర్పిన పాఠాల్లో ఆర్థిక రక్షణ ఒకటి. తనపై ఆధారపడిన వారికి ఏ పరిస్థితుల్లోనూ డబ్బు పరమైన ఇబ్బందులు రావద్దు అనుకునే వారందరూ.. బీమాను ఆశ్రయిస్తున్నారు. పేరుకు పాలసీలు చేయడం కాదు.. అవి మనకు

Updated : 05 Dec 2021 16:02 IST

కరోనా మహమ్మారి మనకు నేర్పిన పాఠాల్లో ఆర్థిక రక్షణ ఒకటి. తనపై ఆధారపడిన వారికి ఏ పరిస్థితుల్లోనూ డబ్బు పరమైన ఇబ్బందులు రావద్దు అనుకునే వారందరూ.. బీమాను ఆశ్రయిస్తున్నారు. పేరుకు పాలసీలు చేయడం కాదు.. అవి మనకు ఎంత మేరకు ధీమానిస్తున్నాయన్నదే కీలకం. ఈ నేపథ్యంలో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఎంత మొత్తానికి ఉండాలనేది చూసుకోవాలి. అందుకు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాలేమిటో తెలుసుకోవాలి.

పాలసీ ఏదైనా సరే.. మీ అవసరం ఏమిటి, ఎందుకు తీసుకుంటున్నారనేది ప్రధానం. ముందుగా వాటిని ఒక క్రమంలో పరిశీలించాలి. ఆ తర్వాతే ఏ బీమా పాలసీని ఎంత తీసుకోవాలనే విషయంలో మీకు స్పష్టత వస్తుంది. పాలసీలకు సంబంధించిన నియమ నిబంధనలూ స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

* బీమా పాలసీని తీసుకునేటప్పుడు సరైన మొత్తానికి ఎంచుకోవాలి. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీ ఉండాలి. విలువ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ప్రీమియమూ అధికంగానే ఉంటుంది. కానీ, ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో ఇలాంటి చిన్న విషయాలకు రాజీ పడకూడదు. ముఖ్యంగా ఆరోగ్య బీమా విషయంలో. అనుకోని అనారోగ్యం వచ్చి, ఆసుపత్రిలో చేరినప్పుడు పాలసీ మొత్తం సరిపోకపోతే.. ఆర్థికంగా ఎంత ఇబ్బందో ఊహించుకోండి.

* తక్కువ మొత్తానికి బీమా తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అదే సమయంలో పాలసీకి సంబంధించిన నియమ నిబంధనలనూ సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే.. క్లెయిం వేళలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వేటికి బీమా వర్తిస్తుంది, మినహాయింపులు ఏమున్నాయనేది తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో తీవ్ర వ్యాధుల చికిత్సకు పరిహారం ఇస్తారా? జీవన శైలి వ్యాధుల సంగతేమిటి? ఇలాంటివన్నీ చూసుకోవాలి.

* బీమా పాలసీల ఎంపికలో ఏదైనా సమస్య ఉంటే వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవచ్చు. ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మనకు సరైన పాలసీ ఏమిటన్నది వారి ద్వారా ఎంపిక చేసుకోవడం వల్ల అనవసర పాలసీలను కొనుగోలు చేయడం తప్పుతుంది.

* ప్రీమియం చెల్లింపు సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఎదురుకాకుండా చూసుకోవాలి. పన్ను ఆదా కోసమో.. ఇంకా ఏదైనా ఇతర కారణాలతో అధిక ప్రీమియం పాలసీలను తీసుకున్న తర్వాత.. వాటిని కొనసాగించే సమయంలో చిక్కులు రాకూడదు. మీరు ఎంత ప్రీమియం చెల్లించగలరు? ఆ ప్రీమియానికి ఏ బీమా సంస్థ ఎంత మొత్తానికి బీమా ఇవ్వగలదు అనేది బేరీజు వేసుకోండి.

* కష్ట సమయంలో ఆర్థిక రక్షణ కల్పించేవి బీమా పాలసీలు. వీటిని పెట్టుబడి దృష్టితో చూడటం  సరికాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు