Governor Row: గవర్నర్‌ ప్రసంగంపై వివాదం.. తమిళనాట పోస్టర్ల కలకలం!

Tamil Nadu: తమిళనాడులో పలు చోట్ల గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. దీనిపై భాజపా నాయకులు సైతం పోటీగా నిరసన తెలియజేశారు. 

Updated : 10 Jan 2023 17:20 IST

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై రేగిన వివాదం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ ఘటనకు కొనసాగింపుగా గవర్నర్‌కు వ్యతిరేకంగా మంగళవారం తమిళనాట పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ట్వీట్లు పోటెత్తాయి. దీనికి పోటీగా భాజపా మద్దతుదారులు గవర్నర్‌కు అనుకూలంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టారు. పలు చోట్ల నిరసనలు తెలియజేశారు.

తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో కొన్ని పదాలను, రాష్ట్ర రాజకీయ నాయకుల పేర్లను గవర్నర్‌ పలకపోవడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రభుత్వం సహా డీఎంకే కూటమి పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. సభ్యులకు అందించిన ముద్రిత ఆంగ్ల ప్రసంగం, సభాపతి చదివిన తమిళ ప్రసంగాన్ని మాత్రమే సభ రికార్డుల్లోకి ఎక్కించాలని, గవర్నర్‌ సొంత వ్యాఖ్యలను రికార్డుల్లో ఎక్కించరాదని తీర్మానాలు ప్రతిపాదించారు. తొలి తీర్మానం ప్రతిపాదించే సమయంలో గవర్నర్‌ సభ నుంచి నిష్క్రమించారు. సీఎం ప్రతిపాదించిన తీర్మానాలను సభలో ఆమోదించారు. స్టాలిన్‌ వ్యాఖ్యలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు.

ఈ ఘటనకు కొనసాగింపుగా మంగళవారం ట్విటర్‌లో#GetoutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది. చెన్నైలోని పలు చోట్ల ఇదే పేరుతో పోస్టర్లూ వెలిశాయి. దీనికి పోటీగా పుదుకొట్టాయ్‌లో భాజపా స్థానిక నాయకులు గవర్నర్‌కు మద్దతుగా పోస్టర్లు అతికించారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామ ఐపీసీ సెక్షన్‌ 124 కింద డీఎంకే ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు.

కోయంబత్తూరులో గవర్నర్‌కు వ్యతిరేకంగా తంతాయ్‌ పెరియార్‌ ద్రవిడార్‌ కళగం నాయకులు ఆందోళన నిర్వహించారు. గవర్నర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు.దీనికి ప్రతిగా స్థానిక భాజపా నాయకులు నిరసన తెలియజేశారు. ఈ ఘటనలో ఇరు వర్గాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వివాదం సమసిపోక ముందే రాజ్‌భవన్‌ మరో వివాదంలో చిక్కుకుంది. పొంగల్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఆహ్వానాలపై జాతీయ చిహ్నం మాత్రమే ముద్రించి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ముద్రించకపోవడాన్ని వివాదానికి కారణమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని