Rahul Gandhi: ‘గుర్రాల రేసులో గాడిద..!’ కేంద్ర మంత్రి పురీ వ్యంగ్యాస్త్రాలు

రాహుల్‌ గాంధీపై వేటు విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ సూచించారు. ‘నేను సావర్కర్‌ను కాదు’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. గుర్రాల రేసులో గాడిదను తీసుకొస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Published : 28 Mar 2023 00:32 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు విషయంలో ప్రతిపక్షాలు సోమవారం పార్లమెంటు (Parliament)లో పెద్దఎత్తున నిరసన తెలిపాయి. విపక్ష నేతలు నల్లదుస్తుల్లో ర్యాలీ తీశారు. అయితే, ఈ పరిణామాలను కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ (Hardeep Singh Puri) ఖండించారు. న్యాయ వ్యవస్థ పనితీరుతోపాటు తమ రాజకీయ ప్రసంగాలు, వాటిని సమర్థించుకునే విషయంలో కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘నేను సావర్కర్‌ను కాదు. క్షమాపణలు చెప్పను’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. సావర్కర్‌ వంటి వ్యక్తుల పోరాటం గురించి తెలుసా? అని కేంద్ర మంత్రి పురీ ప్రశ్నించారు. గుర్రాల రేసులో గాడిదను తీసుకొస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహాభారతం, సావర్కర్‌లను ఉటంకించడాన్ని గుర్తుచేస్తూ.. అసలేం జరుగుతోందన్నారు. ‘రాహుల్‌ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. తదనంతరం అనర్హత విషయంలో వాటికవే జరిగే ప్రక్రియలు ఉన్నాయి. ఈ విషయంపై కోర్టులో పోరాడాలి. కాంగ్రెస్‌ విషయంలో దేశ ప్రజలే తీర్పు ఇస్తారు’ అని పురీ అన్నారు.

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇటీవల రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనంతరం లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని