నీటిపై హామీలు.. మనం ఏమేరకు వాడుతున్నాం.?

బల్దియా ఎన్నికల నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్‌ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో నీటి ఉచిత సరఫరాపై హామీలు ఇచ్చారు. అధికార పార్టీ తెరాస సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ...

Updated : 12 Oct 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : బల్దియా ఎన్నికల నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్‌ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో నీటి ఉచిత సరఫరాపై హామీలు ఇచ్చాయి. అధికార పార్టీ తెరాస సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ డిసెంబరు నెల నుంచి 20 వేల లీటర్ల వరకూ నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు. దీనికి పోటీగా తాము గెలిస్తే 30 వేల లీటర్లు నీళ్లు ఉచితంగా ఇస్తామని మంగళవారం నాడు కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో నలుగురు సభ్యులు గల కుటుంబం నెలకు ఎన్ని లీటర్ల నీటిని వాడుతుంది.. ఒక్కో మనిషి సగటున ఏ మేరకు నీటిని వినియోగిస్తాడు.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.. 

ఒక వ్యక్తికి 100 లీటర్లు.. 

ఒక వ్యక్తి రోజుకు తన అవసరాల నిమిత్తం 100 నుంచి 140 లీటర్ల వరకూ నీటిని ఉపయోగిస్తాడని అంచనా. ఈ మేరకు వ్యక్తిగత ఇళ్లలో నివాసం ఉండే కుటుంబంలోని సభ్యులను బట్టి రోజుకు 300 లీటర్ల నుంచి 600లీటర్ల వరకూ నీరు అవసరం అవుతుంది. ఈ లెక్కన ఓ కుటుంబం నెలకు 18 వేల లీటర్ల వరకూ నీటిని ఉపయోగిస్తుంది. రాజకీయ పార్టీల హామీలు నెరవేరితే గ్రేటర్‌ పరిధిలో చాలా బస్తీల్లో ఉన్న ప్రజలకు ఈ ఉచిత నీటి సరఫరా వల్ల లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ సగటున ఓ రోజుకు ఇంటికి 500 లీటర్ల వరకూ నీటిని అందిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలో దాదాపు పది లక్షల నల్లా కనెక్లన్లు ఉన్నాయి. వాటిలో 3 శాతg వాణిజ్యానికి సంబంధించినవి కాగా.. మిగతా గృహసంబంధమైనవి. ఎక్కువ శాతం బస్తీ వాసులు నెలకు 20 వేల లీటర్లకు లోపే నీటిని వినియోగిస్తారని అంచనా. 

అపార్ట్‌మెంట్స్‌.. అంతస్తుల్లో ఉన్న వారికి..

అధికార తెరాస, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల మేరకు ఒక నల్లా కనెక్షన్‌ ఉన్నవారి నీటి వినియోగం 20, 30 వేల లీటర్లకు మించితే బిల్లు వసూలు చేస్తారు. అయితే అపార్టుమెంట్స్‌, బహుళ అంతస్తుల్లో దాదాపు కుళాయి కనెక్షన్‌ ఒకటే ఉంటుంది. దీంతో నీటి వినియోగం కచ్చితంగా ఇరవై వేల లీటర్లు దాటుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ అపార్టుమెంట్‌లో ఉన్న వాళ్లు నెలకు 60 వేల లీటర్ల నీటిని వాడారనుకుంటే.. 20 లేదా 30 వేల లీటర్ల మేరకు మినహాయించి మిగతా దానికి నీటి బిల్లు వేస్తారు. ఉచిత నీటి సరఫరా హామీ వల్ల దాదాపు ప్రజలందరికీ లబ్ధి చేకూరినా.. అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల్లో ఉండేవారు కొంతమేర బిల్లు చెల్లించాల్సిన అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని