Ghulam Nabi Azad: రాహుల్‌ వల్లే పార్టీ నాశనం.. నా రాజీనామాకు ఆయన తీరూ కారణమే..!

తాను పార్టీని వీడడానికి రాహుల్‌ గాంధీ తీరు కూడా ఓ కారణమంటూ గులాంనబీ ఆజాద్‌ తీవ్ర విమర్శలు చేశారు.

Updated : 26 Aug 2022 14:04 IST

అధ్యక్షురాలికి రాసిన లేఖలో మండిపడ్డ ఆజాద్‌

దిల్లీ: ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన గులాంనబీ ఆజాద్‌(Ghulam Nabi Azad).. చివరికి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసిన ఆయన.. తాను పార్టీని వీడడానికి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తీరు ఓ కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ (Sonia Gandhi) ఉన్నప్పటికీ.. రాహుల్‌ గాంధీ అనుచరులే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని దుయ్యబట్టారు. రాజీనామా (Resignation) లేఖలో రాహుల్‌ గాంధీ తీరును ఆజాద్‌ ప్రధానంగా ప్రస్తావించారు.

2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి పార్టీని ఆయన నడిపిన తీరుపై ఆజాద్‌ విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్‌ నేతలను పక్కనబెట్టి.. కేవలం పీఏలు, సెక్యూరిటీ గార్డులు, కోటరీల సలహాలతోనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునేవారని మండిపడ్డారు. వారితోనే పార్టీని నడపడం మొదలుపెట్టారని.. తద్వారా పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిందని రాహుల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇక పార్టీలో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని.. రిమోట్‌ కంట్రోల్‌ మోడల్‌లో పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయని విమర్శించారు.

రాహుల్‌ గాంధీపై ఆజాద్‌ చేసిన విమర్శల్లో కొన్ని..

* రాహుల్‌ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం

ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులను చింపివేయడం ఆయన అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనం

2014లో పార్టీ ఓటమి చెందడానికి రాహుల్‌ తీరే కారణం

పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంలోనూ రాహుల్‌ తీరు బాగాలేదు

పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్‌ పూర్తిగా నాశనం చేశారు

సీనియర్‌ నాయకులందర్నీ రాహుల్‌ పక్కనబెట్టారు

అనుభవం లేని వ్యక్తులతో కోటరీని ఏర్పాటు చేసుకొని పార్టీని నడిపిస్తున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు