Maharashtra: అసలైన శివసేన మాదే..ఆ గుర్తు మాకే ఇవ్వండి!

మహరాష్ట్రలోని తూర్పు అంధేరి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన గుర్తును తమ వర్గానికే కేటాయించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ రాశారు.

Published : 07 Oct 2022 01:31 IST

ముంబయి: మహారాష్ట్రలోని తూర్పు అంధేరి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన గుర్తును తమ వర్గానికే కేటాయించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ రాశారు. నిజానికి ఈ స్థానం నుంచి శిందే వర్గం మద్దతుతో భాజపా బరిలోకి దిగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ‘విల్లు-బాణం’ గుర్తుతో బరిలోకి దిగే అవకాశముందని, అందుకే దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని శిందే కోరారు. ‘‘ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తప్పనిసరిగా గుర్తుకావాలి. అందువల్ల ఉద్ధవ్‌ ఠాక్రే వర్గీయులు రాజ్యాంగ విరుద్ధంగా, అన్యాయంగా శివసేన అధికారిక గుర్తును దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో శిందే పేర్కొన్నారు. నిజమైన శివసేన ఎవరిదో వారికే విల్లు-బాణం గుర్తు దక్కాలని ఆయన అన్నారు. ఈ గుర్తును ఎవరికి కేటాయించాలన్న అంశం ప్రస్తుతం ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. రూల్‌ ఆఫ్‌ మెజారిటీ ప్రాతిపదికన గుర్తును ఏదో ఒక వర్గానికి కేటాయించనున్నారు.

మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున శిందే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శిందే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతిచ్చింది. ఠాక్రే, శిందే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశం ఇప్పుడు ఈసీ పరిధిలో ఉంది. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని