Published : 28 Jan 2022 01:48 IST

Goa Election 2022: కమలం పట్టిన కోడలు.. హస్తానికి హ్యాండ్‌ ఇచ్చిన మామ

పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గోవా మాజీ సీఎం

పనాజీ: మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌సిన్హ్‌ రాణె పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. వయసు రీత్యా తాను ఎన్నికల బరి నుంచి వెనక్కి తగ్గినట్లు రాణె వెల్లడించారు. అయితే తాను పోటీ చేస్తున్న స్థానం నుంచే ఆయన కోడలు భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాణె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌ నేత అయిన రాణెను మరోసారి పోరియెం నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది డిసెంబరులోనే ప్రకటించింది. పోరియెం నియోజకవర్గం.. రాణెకు కంచుకోట లాంటిది. 11 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన.. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఈసారి కూడా పోరియెం సీటు తమదే అని కాంగ్రెస్‌ విశ్వాసంగా ఉంది.

అయితే గతవారం పోరియెం నియోజకవర్గం నుంచి రాణె కోడలు దివ్య విశ్వజిత్ రాణె పోటీ చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. దీంతో ఇది కాస్తా కుటుంబ వివాదానికి దారితీసింది. రాణె కుమారుడు విశ్వజిత్‌ గతంలో కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే 2017 ఎన్నికల తర్వాత కమలదళంలో చేరగా.. ప్రస్తుతం ఆయన భాజపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. నిజానికి ప్రతాప్‌ రాణెపై పోటీకి ముందుగా ఆయన కుమారుడు విశ్వజిత్‌నే దించాలని భాజపా భావించింది. కానీ, తర్వాత ప్రతాప్‌ కోడలిని తెరపైకి తీసుకొచ్చింది. విశ్వజిత్‌ను వాల్పోయి అభ్యర్థిగా ప్రకటించిన భాజపా.. పోరియెం నుంచి దివ్య పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 

ఇదిలా ఉండగా.. తన కోడలికి భాజపా టికెట్‌ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ప్రతాప్‌సిన్హ్‌ రాణె కాషాయ పార్టీకి ఆఫర్‌ ఇచ్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, వయసు రీత్యానే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే..

గత 50 ఏళ్లుగా పోరియెం నియోజకవర్గంలో తిరుగులేని విజయం సాధిస్తున్న కాంగ్రెస్‌కు ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. 87 ఏళ్ల ప్రతాప్‌సిన్హ్‌ రాణె గోవా కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌ నేత. గోవాకు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఈయనే. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆరు సార్లు సీఎంగా వ్యవహరించారు. 

ఇదిలా ఉంగా.. రాష్ట్రానికి రాణె అందించిన సేవలను గుర్తించి ఇటీవలే గోవా ప్రభుత్వం ఆయనకు జీవితకాల కేబినెట్‌ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాణె పోటీ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని