Goa: మరో నెల రోజుల్లో ఎన్నికలు.. గోవాలో భాజపాకు దెబ్బ!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గోవాలో భాజపాకు షాక్‌ తగిలింది! రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే మైకెల్‌ లోబో సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. భాజపా సామాన్యుల పార్టీ కాదని పేర్కొంటూ.. తన పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారు. ‘భాజపా...

Published : 11 Jan 2022 01:19 IST

రాజీనామా చేసిన రాష్ట్ర మంత్రి

పనాజీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత తరుణంలో గోవాలో భాజపాకు షాక్‌ తగిలింది! రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే మైకెల్‌ లోబో సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. భాజపా సామాన్యుల పార్టీ కాదని పేర్కొంటూ.. తన పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారు. ‘భాజపా.. సామాన్య ప్రజల పార్టీ కాదని ఓటర్లు నాతో చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి, ఎమ్మెల్యే పదవులతోపాటు పార్టీకీ రాజీనామా చేశా. తదుపరి నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తా’ అని ఆయన తెలిపారు. చేరిక విషయమై ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరినా.. అది భారీ సీట్లతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

కలంగుటే నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మైఖేల్ లోబో కొన్నాళ్లుగా పార్టీని బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నిర్మించిన పార్టీ ఇది కాదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. పారికర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్‌తో ఆయనకు విభేదాలు వచ్చాయి. పారికర్‌తో సన్నిహితంగా ఉన్న నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు దాదాపు ఒక నెల ముందు రాజీనామా చేయడం గమనార్హం. అయితే లోబో నిర్ణయం.. గోవాలోని బర్దేజ్‌ రీజియన్‌లో భాజపాపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కలంగుటేతోసహా అక్కడ ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 40 సీట్లు ఉన్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని