Goa Polls: గోవా ‘పవర్‌’ గేమ్‌.. భాజపా బుజ్జగింపులు.. కాంగ్రెస్ కసరత్తులు

తీర రాష్ట్రం గోవాలో మరోసారి హంగ్‌ తలెత్తే సంకేతాలు కన్పిస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. దీంతో గోవాలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు కూటముల

Updated : 08 Mar 2022 14:50 IST

కూటముల కూర్పులో ప్రధాన పార్టీలు బిజీజిజీ..!

పనాజీ: తీర రాష్ట్రం గోవాలో మరోసారి హంగ్‌ తలెత్తే సంకేతాలు కన్పిస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. దీంతో గోవాలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు కూటముల ఏర్పాటుపై దృష్టిపెట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే చిన్న పార్టీలు, స్వతంత్రులను సంప్రదించడంలో బిజీ అయ్యాయి. 

ప్రధానితో గోవా సీఎం భేటీ..!

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ తన్వడే దిల్లీలో ఉన్నారు. నేడు వీరు ప్రధానమంత్రి నరంద్రమోదీని కలిశారు. గోవాలో మరోసారి అధికారం చేపట్టేందుకు భాజపాకు ఉన్న అవకాశాలపై సావంత్‌.. మోదీతో చర్చించారు. మరోవైపు సీఎం సావంత్‌ నేడు ముంబయి వెళ్లి గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ దేవేంద్ర ఫడణవీస్‌ను కలవనున్నారు. 

ఎంజీపీకి కమలదళం బుజ్జగింపులు..

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోతే మహారాష్ట్రవాడి గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ) మద్దతు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం సావంత్‌ నేడు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే భాజపా అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ‘‘గోవాలో 22 సీట్ల కంటే ఎక్కువే సాధిస్తామని భాజపా విశ్వాసంగా ఉంది. ఒకవేళ మెజార్టీ సాధించలేకపోతే.. స్వతంత్రులు, ఎంజీపీ పార్టీ మద్దతు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ఎంజీపీతో చర్చలు జరుపుతున్నాం’’ అని సావంత్‌ వెల్లడించారు.

గత ఎన్నికల తర్వాత భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎంజీపీ పార్టీ.. ఈ ఏడాది ఎన్నికలకు ముందే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎంజీపీ నేతలను బుజ్జగించి.. ఈ సారి కూడా అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని కమలదళం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గోవా వ్యవహారాల బాధ్యుడు దేవేంద్ర ఫడణవీస్‌.. ఎంజీపీతో కూటమిపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ప్రమోద్‌ సావంత్‌ను సీఎంగా ఎన్నుకోకపోతే ఎంజీపీ కూడా భాజపాకు మద్దతిచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. 

కాంగ్రెస్‌.. 2017 సీన్‌ రిపీట్‌ అవ్వొద్దని..! 

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాజపాకు 13 సీట్లు దక్కాయి. అయితే భాజపా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంజీపీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా గోవాలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ గట్టిగా అంచనా వేస్తున్నాయి. దీంతో గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కాంగ్రెస్‌ కూడా వేగంగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్‌ పెద్దలు.. ఆయా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఏదేమైనా.. గోవాలో అధికార ఆట మొదలైంది. మరి ఈ ఆటలో గెలిచేదెవరో.. అధికార పీఠం దక్కేదెవరికో మార్చి 10 తర్వాతే తెలుస్తుంది..!  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని