Sunil Jakhar: గుడ్‌ లక్‌ అండ్ గుడ్‌బై కాంగ్రెస్‌.. పార్టీ వీడిన సీనియర్‌ నేత

కాంగ్రెస్‌ (Congress) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చింతన్‌ శిబిర్‌ నిర్వహిస్తోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖఢ్‌ (Sunil Jakhar) పార్టీని వీడారు.. కొద్ది గంటల క్రితమే

Updated : 14 May 2022 15:23 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చింతన్‌ శిబిర్‌ నిర్వహిస్తోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖఢ్‌ (Sunil Jakhar) పార్టీని వీడారు.. కొద్ది గంటల క్రితమే తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘కాంగ్రెస్‌’ పదాన్ని తొలగించిన ఆయన.. నేడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇటీవల జాఖఢ్‌పై కాంగ్రెస్‌ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

చన్నీపై ఆరోపణలతో తీవ్ర దుమారం..

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని లక్ష్యంగా చేసుకుని సునీల్‌ జాఖఢ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ టీవీ ఛానల్‌లో జాఖఢ్‌ మాట్లాడుతూ.. అమరీందర్‌ రాజీనామా తర్వాత ఆ స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం చన్నీని నియమించడాన్ని ప్రశ్నించారు. ఆయన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జాఖఢ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత కూడా ఆయన చన్నీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆయనపై కొందరు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, జాఖఢ్‌ను రెండేళ్ల పాటు అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామాలతో అసంతృప్తి చెందిన జాఖఢ్‌.. అప్పటి నుంచే తన భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే నిన్న తన సోషల్‌మీడియా ఖాతాల నుంచి కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని పదాలను తొలగించారు. ఈ ఉదయం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘గుడ్‌ లక్‌ అండ్ గుడ్‌బై కాంగ్రెస్‌’’ అంటూ ప్రకటించారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత సీఎం రేసులో జాఖఢ్‌ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఎన్నికల దృష్ట్యా సిక్కు వ్యక్తిని సీఎం చేయాలని కొందరు పార్టీ నేతలు సూచించడంతో చన్నీని ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటి నుంచే జాఖఢ్‌ కలత చెందారని తెలుస్తోంది.

వారి కుటుంబం.. 50 ఏళ్లుగా కాంగ్రెస్‌తోనే..

జాఖఢ్‌ కుటుంబం 50 ఏళ్లుగా కాంగ్రెస్‌కు పనిచేస్తోంది. సునీల్‌ తండ్రి బలరాం జాఖఢ్‌ కాంగ్రెస్‌ తరఫున మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికవ్వడమే గాక.. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1980 నుంచి 1989 మధ్య వరుసగా తొమ్మిదేళ్ల పాటు సభాపతిగా ఉన్న ఆయన.. లోక్‌సభకు సుదీర్ఘకాలం స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. పీవీ నరసింహరావు హయాంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు. ఇక సునీల్‌ జాఖఢ్‌ పంజాబ్‌లోని అబోహర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని