UP Polls: అఖిలేశ్‌ ప్రభుత్వం వస్తే మళ్లీ గూండారాజ్‌: అమిత్‌ షా

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. .....

Published : 27 Jan 2022 19:54 IST

మథుర: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. తాజాగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సతువా గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలకు ఆయనే స్వయంగా ప్రచార కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ గూండా రాజ్యమే వస్తుందని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ రెండూ వారసత్వ, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. గతంలో సమాజ్‌వాదీ సారథ్యంలోని ప్రభుత్వంలో గూండాలు రాజ్యమేలలేదా? బలవంతులు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదా? మహిళలు అవమానాలు ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. ఎస్పీ నేత అజంఖాన్‌పై నమోదైన కేసులకు సీఆర్‌పీసీలో సెక్షన్లు కూడా సరిపోలేదంటూ అమిత్‌ షా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై విమర్శలు చేస్తున్న అఖిలేశ్‌కు దాని గురించి మాట్లాడే హక్కులేదన్నారు.

భాజపా తిరిగి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు చేయడంతో పాటు పారదర్శకంగా పాలన అందిస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం తమపై అవినీతి ఆరోపణలు చేయలేరన్నారు. భాజపాకు ముందు రాష్ట్ర ప్రజలు ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలను చూశారనీ.. కేవలం కులాల కోసమే వారు పనిచేశారంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వారి వద్ద ప్రణాళికలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి సారథ్యంలోనే యావత్‌ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. భాజపా కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితమై పనిచేసే పార్టీ కాదనీ.. మొత్తం సమాజానికి చెందినదన్నారు. 2017లో రాష్ట్ర ప్రజలు కుల, వారసత్వ రాజకీయాలను తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల ఇళ్ల నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ నోట్ల కట్టలు బయటపడుతున్నాయనీ.. భాజపాపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్‌ హామీ ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామమందిరం, వారణాసిలో కాశీవిశ్వనాథ్‌ కారిడార్‌ను నిర్మిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని