Chandrababu: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేత గోవర్ధన్‌రెడ్డి

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు గోవర్ధన్‌రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో

Updated : 19 Aug 2022 19:38 IST

మంగళగిరి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు గోవర్ధన్‌రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. కొల్లిపర మండలం నుంచి వచ్చిన కార్యకర్తలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రైతుల సమస్యలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఒక ఆశయం కోసం తెదేపాలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. జగన్‌ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే భావన ప్రజల్లో ఉందన్నారు.

గుదిబండి చేరిక సందర్భంగా ఎన్టీఆర్‌ భవన్‌కు భారీగా తరలివచ్చిన శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘‘గోవర్ధన్‌రెడ్డి, అతని అనుచరులను మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం. ఆయన పదేళ్లపాటు వైకాపాలో పనిచేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గోవర్ధన్‌రెడ్డి. ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందుకే ఈరోజు తెదేపాలో చేరారు. మనసు ఉన్నవారు ఎవరూ వైకాపాలో ఉండరు.  ప్రస్తుతం దేశంలో రాజధానిలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నావంతు కర్తవ్యం నిర్వహిస్తా. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో జరిగిన ఐదు ఘటనలు చూసి బాధ కలిగింది. గంగాధర నెల్లూరులో ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్‌ శవమై తేలాడు. ఏలూరు జిల్లాలో వైకాపా ఎంపీటీసీని వేధించి తప్పుడు కేసులు పెడితే సెల్ఫీ వీడియో తీసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. పల్నాడులో ముగ్గురాయి వ్యాపారంకోసం వైకాపా నేతలు బహిరంగంగా ఘర్షణలకు దిగారు. ఉయ్యూరులో వైకాపా జడ్పీటీసీ పూర్ణిమ .. గౌరవ ప్రదమైన మహిళలు ఈ పార్టీలో ఉండలేరంటూ పదవికి రాజీనామా చేశారు. అనంతపురంలో ద్రాక్షతోటలో పనిచేసేందుకు వచ్చిన ముగ్గురు కూలీలు ప్రభుత్వ మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన నాసిరకం మద్యం తాగి చనిపోయారు. అన్యాయమని నిలదీస్తే వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బు కక్కుర్తితో మద్యం తయారీ, విక్రయం అన్నీ వారివే. మూడేళ్లలో జరిగిన అన్యాయాలపై ప్రజల్లో చాలా బాధ ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు