Kerala CM: వీసీల రాజీనామా కోరే అధికారం గవర్నర్‌కు లేదు

యూనివర్సిటీ ఉప కులపతిల రాజీనామాలను కోరే అధికారం గవర్నర్‌కు లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్‌ ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో యూనివర్సిటీలను నాశనం చేసే ఉద్దేశంతోనే ఆయన యుద్ధానికి దిగుతున్నారని అన్నారు.

Published : 24 Oct 2022 14:16 IST

తిరువనంతపురం: విశ్వవిద్యాలయాల ఉప కులపతుల రాజీనామాలను కోరడంపట్ల కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మండిపడ్డారు. గవర్నర్‌కు అటువంటి అధికారాలే లేవని.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ అనుసరిస్తోన్న విధానం.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలపై దురాక్రమణ ప్రయత్నమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీలు సోమవారం నాటికి రాజీనామా చేయాలంటూ కేరళ గవర్నర్‌ హుకుం జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ విధంగా స్పందించారు.

‘గవర్నర్‌ది అసాధారణ నిర్ణయం. రాష్ట్రంలో యూనివర్సిటీలను నాశనం చేసే ఉద్దేశంతోనే ఆయన యుద్ధానికి దిగుతున్నారు. ఆ తొమ్మిది యూనివర్సిటీల వీసీలను నియమించింది గవర్నరే. అవన్నీ అక్రమంగా జరిగాయని భావిస్తే.. ఆ బాధ్యత గవర్నర్‌దే. ఛాన్సలర్‌గా ఉన్న వ్యక్తికి వీసీల రాజీనామా కోరే అధికారం లేదు’ అని పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

మరోవైపు గవర్నర్‌ ఆదేశాలు అందినప్పటికీ.. రాజీనామా చేసేందుకు వీసీలు ససేమిరా అంటున్నారు. ఆర్థికపరమైన అక్రమాలు, చెడు ప్రవర్తన వంటివి జరిగితే రాజీనామా చేయాల్సి ఉంటుందని.. కానీ, తన విషయంలో అటువంటివి లేనప్పుడు ఎందుకు రాజీనామా చేయాలని కన్నూర్‌ యూనివర్సిటీ వీసీ గోపీనాథ్‌ రవీంద్రన్‌ స్పష్టం చేశారు. తన నియామక అంశం న్యాయస్థానంలో ఉండగా.. గవర్నర్‌ ఎలా రాజీనామా కోరుతారని ప్రశ్నించారు.

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున తిరువనంతపురంలోని అబ్దుల్‌ కలాం విశ్వవిద్యాలయ వీసీ నియామకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేతికి అస్త్రంగా మారాయి. దీంతో రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీలు సోమవారం కల్లా రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఈ 9 వర్సిటీల్లో ఏ ఒక్కరూ రాజీనామా ప్రకటించలేదు. దీంతో గవర్నర్‌ కార్యాయలం, ప్రభుత్వం మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. గవర్నర్‌ నిర్ణయాలను నిరసిస్తూ అధికార పక్షం ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని