West Bengal: గవర్నర్‌ అవినీతిపరుడు.. దీదీ

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ను తొలగించాలని కేంద్రానికి ఇప్పటికే మూడు లేఖలు రాశానని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Published : 29 Jun 2021 01:37 IST

గవర్నర్, సీఎంల మధ్య మరింత ముదురుతోన్న వివాదం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడుమ నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్‌ బహిరంగ విమర్శలు చేస్తుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదేస్థాయిలో వాటిని తిప్పికొడుతున్నారు. తాజాగా మరో ముందడుగు వేసిన దీదీ.. గవర్నర్‌ అవినీతిపరుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ను తొలగించాలని కేంద్రానికి ఇప్పటికే మూడు లేఖలు రాశానని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

‘పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను తొలగించాలని కేంద్రానికి మూడు లేఖలు రాశాను. అతనొక అవినీతిపరుడు. 1996నాటి జైన్‌ హవాలా కేసు ఛార్జిషీట్‌లో ఆయన పేరుంది’ అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన మాకు గవర్నర్‌ ఎందుకు ఆదేశాలు జారీచేస్తారని ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, మూడోసారి అధికారంలోకి వచ్చిన దీదీ ప్రభుత్వానికి గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని గవర్నర్‌ విమర్శిస్తున్నారు. అదే సమయంలో బెంగాల్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ సమావేశానికి హాజరు కాకపోవడంపట్ల మమతా బెనర్జీపై గవర్నర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారంటూ మమతా బెనర్జీ గవర్నర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని