Padma awards 2023: ములాయంకు పద్మవిభూషణ్‌.. కేంద్రంపై ఎస్పీ నేతల విమర్శలు!

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించడంపై ఆ పార్టీ నేతలు  కొందరు విమర్శలు చేస్తున్నారు.ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 26 Jan 2023 17:41 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం దివంగత ములాయం సింగ్‌ యాదవ్‌(Mulayam Singh Yadav)కు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్(Padma Vibhushan) పురస్కారం ప్రకటించడం పట్ల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా ములాయం వ్యక్తిత్వాన్ని, ఆయన సేవల్ని కేంద్రం అపహాస్యం చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. ములాయంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ‘నేతాజీ ములాయం సింగ్‌ యాదవ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని, దేశానికి చేసిన సేవల్ని కేంద్రం అపహాస్యం చేసింది. ఆయన్ను గౌరవించాలనుకుంటే కేంద్రం భారతరత్నతో సత్కరించి ఉండాల్సింది’’ అని ఎస్పీ ఎమ్మెల్యే స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ చేశారు. అలాగే, అదే పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఐపీ సింగ్‌ సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారతరత్న తప్ప మరేదీ ములాయం సింగ్‌ యాదవ్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టదని పేర్కొన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కోరారు. 

ఇదే అంశంపై ములాయం సింగ్‌ యాదవ్‌కు పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించడంపై ఆయన సోదరుడు శివ్‌పాల్‌సింగ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ములాయం సింగ్‌ సమాజంలోని పేదలు, కార్మికులు, యువత, విద్యార్థులు, న్యాయవాదులు, నిరుద్యోగులు తదితర అనేక వర్గాల ప్రజల గళాన్ని వినిపించారన్నారు. కేంద్రరక్షణ మంత్రిగా పనిచేసిన సమయంలో సైనిక సిబ్బంది కోసం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. 

దేశ రాజకీయాల్లో రాజకీయ మల్ల యోధుడిగా పేరున్న ములాయం సింగ్‌ యాదవ్‌ గతేడాది అక్టోబర్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌కు మూడు పర్యాయాలు సీఎంగా, కేంద్రమంత్రిగా సేవలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని