Chandra babu: చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం

తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు.

Published : 06 Jul 2024 05:42 IST

తెదేపా అధినేతకు దారిపొడవునా నీరాజనం
బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ నివాసం వరకు ర్యాలీ
వర్షం కురుస్తున్నా వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు

అభిమానులు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే బేగంపేట, జూబ్లీహిల్స్‌: తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7.20 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తెలంగాణ తెదేపా నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు జనార్దన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లో బాబు నివాసం వరకు నిర్వహించిన ర్యాలీకి  కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. 


చంద్రబాబు రాక సందర్భంగా బేగంపేట-పంజాగుట్ట రహదారిలో తెదేపా కార్యకర్తల ర్యాలీ

అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు సాయంత్రం ఐదు గంటల నుంచే పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో బేగంపేటకు చేరుకున్నారు. డప్పుల మోతలు, కోలాటం, జానపద గీతాలతో విమానాశ్రయ ప్రాంగణం మార్మోగిపోయింది. చంద్రబాబునాయుడు వచ్చాక ‘మేము మీ వెంటే’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వాహనంలో నిలబడి బాబు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వర్షం కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. ఏపీ సీఎం రాకను స్వాగతిస్తూ నగరం మొత్తం పెద్దఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. కేబీఆర్‌ కూడలిలో పార్టీ యువనేత పొగాకు జైరామ్‌ చందర్‌ ఆధ్వర్యంలో భారీ గజమాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద తెదేపా శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చాయి. బాబుకు స్వాగతం పలికిన వారిలో తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్, సీనియర్‌ నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు, చిలువేరు కాశీనాథ్, తిరునగరి జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, అజ్మీరా రాజు నాయక్, శ్రీపతి సతీష్‌ తదితరులున్నారు. 

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మధ్యాహ్నం నేలవాలగా అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులునిలబెట్టారు. దీనిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టారని, అలాంటివి పెట్టే వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని తెలంగాణ పోలీసు శాఖ ‘ఎక్స్‌’ఖాతా ద్వారా హెచ్చరించింది. ఈ మేరకు ఫ్లెక్సీ పడిపోయిన సీసీ ఫుటేజీని, ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు పోలీసులు ఫ్లెక్సీ నిలబెట్టిన వీడియోలను పోస్టు చేసింది.

బేగంపేట విమానాశ్రయానికి తరలివచ్చిన తెదేపా శ్రేణులు, అభిమానులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని