
Gujarat: భాజపా ‘నో రిపీట్’ ఫార్ములా.. గుజరాత్‌లో ‘కొత్త’ కేబినెట్
కొలువుదీరిన భూపేంద్రపటేల్ మంత్రివర్గం
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మూడు రోజుల క్రితం నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టగా.. గురువారం మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 24 మంది శాసనసభ్యులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 14 మంది సహాయ/స్వతంత్ర మంత్రులు.
గుజరాత్‌లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా ‘నో రిపీట్’ విధానాన్ని అవలంభించింది. అందుకు అనుగుణంగానే నూతన మంత్రివర్గంలోకి అంతా కొత్తవారికే అవకాశమిచ్చింది. గతంలో విజయ్ రూపాణీ కేబినెట్‌లో పనిచేసిన ఎవరికీ కూడా తాజా మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం గమనార్హం. అసెంబ్లీ స్పీకర్ రాజేంద్రత్రివేదిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందు రాజేంద్రత్రివేది తన సభాపతి పదవికి రాజీనామా చేశారు.
ఇక, నేడు ప్రమాణస్వీకారం చేసిన వారిలో 21 మంది తొలిసారిగా మంత్రులు కావడం విశేషం. అటు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ కూడా తొలిసారి ఎమ్మెల్యేనే. ఒక్క రాజేంద్ర త్రివేది, రాఘవ్‌జీ పటేల్, కిరీట్‌సిన్హ్ రాణాకు గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం ఉంది.
విజయ్ రూపాణీ రాజీనామాతో గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామాలు అనేక ఊహాగానాలకు తెరలేపాయి. పటేల్ వర్గీయుల మద్దతు కోసమే భాజపా అధిష్ఠానం సీఎం మార్పు చేపట్టినట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్(పాటిదార్ వర్గీయుడు)కు రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మరోవైపు కొత్త మంత్రివర్గంలోనూ పటేల్ వర్గీయులకు అధిక ప్రాధాన్యం కల్పించడం గమనార్హం. నూతన మంత్రివర్గంలో ఆరుగురు పటేల్ వర్గీయులకు చోటు కల్పించారు.