Gujarat Election Result: గుజరాత్‌లో భాజపా సరికొత్త చరిత్ర..!

గుజరాత్‌(Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) భాజపా(BJP) సరికొత్త చరిత్ర సృష్టించింది. తన సొంత రికార్డును బద్దలుకొట్టి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.

Updated : 08 Dec 2022 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ (Gujarat)లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP).. మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను ఇప్పటికే దక్కించుకున్న కమలదళం భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తన సొంత రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర లిఖిస్తోంది(Gujarat election results)

అఖండ మెజార్టీతో..

గుజరాత్‌లో గత ఆరుసార్లు భాజపా (BJP)నే అధికారంలో ఉంది. 182 శాసనసభ స్థానాలున్న గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 92 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం. 1995లో 121, 1998లో 117, 2002లో 127 స్థానాలు, 2007లో 117, 2012లో 115, 2017లో 99 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత భాజపా ఛరిష్మా అమాంతం పెరిగింది. దీంతో అత్యధిక స్థానాల్లో (127) విజయం సాధించింది. కానీ, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి భాజపాపై కొంత వ్యతిరేకత మొదలైంది. దీంతో ఆధిక్యం కాస్త తగ్గుతూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 100 కూడా దాటకుండా 99 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈసారి ఫలితంపై ఉత్కంఠ పెరిగింది. కానీ, భాజపా జోరు ఏ మాత్రం తగ్గలేదు. 2002 ఎన్నికల నాటి రికార్డును బద్దలుకొడుతూ అత్యధిక మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో కమలం పార్టీ ఇప్పటికే దాదాపు 130 స్థానాల్లో విజయం సాధించింది.

ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే..

కాగా.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో అత్యధిక స్థానాలతో అఖండ విజయం సాధించడం ఇప్పుడొక రికార్డు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 149 స్థానాల్లో గెలిచి ఆ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఏ పార్టీకి ఆ స్థాయిలో అత్యధిక స్థానాలు దక్కలేదు. ఇప్పుడు హస్తం పార్టీ రికార్డును బ్రేక్‌ చేసి భాజపా కొత్త చరిత్ర లిఖించేవైపు అడుగులు వేస్తోంది.

దేశంలోనే రెండోసారి..

గుజరాత్‌లో గత ఆరు దఫాలుగా భాజపానే అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి ఒకే పార్టీ విజయం సాధించడం దేశంలో ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం వరుసగా 34 ఏళ్ల పాటు(1977 నుంచి 2011 వరకు) పాలించింది. ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన ఏకైక పార్టీగా భాజపా రికార్డు సాధించనుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని