
Gujarat: స్పీకర్‌కు మంత్రి పదవి.. నితిన్ పటేల్‌కు దక్కని చోటు!
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది. నూతన సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త మంత్రుల బృందం నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనుంది. నిజానికి బుధవారమే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. అనూహ్య కారణాల వల్ల నేటికి వాయిదా పడింది. మంత్రుల ఎంపికపై పార్టీలో భేదాభిప్రాయాల వల్ల ప్రమాణస్వీకారం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రమాణం తర్వాత.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు తొలి కేబినెట్ సమావేశం జరగనుందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. మొత్తం 27 మంది నేడు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇందులో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది పేరు కూడా ఉంది. ఇప్పటికే ఆయన సభాపతి పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు రాఘవ్జీ పటేల్, నరేశ్ పటేల్ తదితరులకు కూడా మంత్రిపదవులు దక్కాయి.
కాగా.. మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్‌పటేల్‌కు కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం గమనార్హం. ఆయనే కాదు, గత కేబినెట్లో పనిచేసిన సీనియర్ నేతలకు కూడా మంత్రిపదవి ఇవ్వలేదని సమాచారం. నూతన మంత్రివర్గంలో ఈసారి అంతా కొత్తవారికే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. గత కేబినెట్లో మంత్రులెవరినీ మళ్లీ తీసుకోలేదు. ఈ విషయంపైనే పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చినట్లు భాజపా వర్గాల సమాచారం. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్తవారికి అవకాశం కల్పించినట్లు సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎం పదవికి విజయ్ రూపానీ అనూహ్య రాజీనామాతో గుజరాత్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తూ భాజపా సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.