ఆమె ‘అర్బన్‌ నక్సలైట్‌’.. సీఎం రేసులో దించాలని ఆప్‌ చూస్తోంది: భాజపా

ఆమెను అర్బన్‌ నక్సలైట్‌‌(urban Naxal).. గుజరాత్‌ వ్యతిరేకిగా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని వచ్చే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తమ సీఎం అభ్యర్థిగా.....

Published : 08 Sep 2022 01:25 IST

సీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యల్ని  ఖండించిన ఆప్‌

అహ్మదాబాద్‌: ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్‌(Medha Patkar)పై గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు, ఎంపీ సీఆర్‌ పాటిల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను అర్బన్‌ నక్సలైట్‌‌(urban Naxal).. గుజరాత్‌ వ్యతిరేకిగా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని వచ్చే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తమ సీఎం అభ్యర్థిగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఆప్‌ వెంటనే స్పందించింది. అధికార భాజపా రూమర్లు వ్యాప్తి చేస్తోందని మండిపడింది. గత వారం గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కూడా గుజరాత్‌లోని నర్మదా నదిపై నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను వ్యతిరేకించినందుకు నర్మదా బచావో ఆందోళన్‌ (ఎన్‌బీఏ) నాయకురాలు మేధాపాట్కర్‌ను ‘అర్బన్‌ నక్సలైట్‌’గా అభివర్ణించారు. ఆమెకు గతంలో రాజకీయ మద్దతు కూడా ఉందని తెలిపారు.

బుధవారం వడోదరలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ సీఆర్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ‘‘దాదాపు 15 ఏళ్లుగా కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఎండిపోయిన ప్రాంతాలకు నర్మదా జలాలు లేకుండా చేసి పాపానికి పాల్పడిన వ్యక్తికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ టిక్కెట్‌ ఇచ్చింది. ఆమే మేధాపాట్కర్‌.. అర్బన్‌ నక్సలైట్‌. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ఎప్పటికీ పూర్తి కానివ్వనని ఒకసారి మేధా పాట్కర్‌ చెప్పారు. ఆనకట్ట పూర్తయితే, కచ్‌, సౌరాష్ట్రలకు నీరు కూడా రాకుండా ఆపుతానని ప్రతినబూనారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆప్‌ సీఎం అభ్యర్థిగా బరిలో దించాలని చూస్తోంది. అలాంటి పార్టీని మనం గుజరాత్‌లోకి ప్రవేశించనివ్వొద్దు. అందరూ అప్రమత్తంగా ఉండండి’’ అని పిలుపునిచ్చారు.

సీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలను ఆప్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆప్‌ గుజరాత్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటియాలా మాట్లాడుతూ.. గుజరాత్‌లో మేధా పాట్కర్ తమ పార్టీ సీఎం అభ్యర్థి అంటూ వ్యాప్తి చేస్తున్న పుకార్లను నిర్ద్వందంగా ఖండిస్తున్నామన్నారు. ఏడేళ్లుగా ఆమె తమ పార్టీతో లేరని స్పష్టంచేశారు. తమ పార్టీకి చెందిన ఏ పదవిలో గానీ.. అసలు ప్రజా జీవితంలోనే చురుగ్గాలేరని చెప్పారు. భాజపా ఇలాంటి రూమర్లును పుట్టిస్తోందని మండిపడ్డారు.  దేశ వ్యతిరేకులైనా, గుజరాత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారెవరైనా తాము ప్రోత్సహించబోమని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్‌ ఈస్ట్‌ నుంచి ఆప్‌నుంచి బరిలోకి దిగిన మేధాపాట్కర్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని